Begin typing your search above and press return to search.

బిగ్ డిబేట్ : రిటైర్ అయిన న్యాయ మూర్తులకు పదవులు సబబేనా...?

By:  Tupaki Desk   |   14 Feb 2023 8:00 AM GMT
బిగ్ డిబేట్ : రిటైర్ అయిన న్యాయ మూర్తులకు పదవులు సబబేనా...?
X
ఈ దేశంలో ఏదో ఒక సమయంలో అన్ని వ్యవస్థల మీద అనుమానాలు వచ్చాయి. సందేహాలతో రచ్చ జరిగిన సందర్భాలు ఉన్నాయి. వ్యవస్థలు గొప్పవే అయినా వాటిని నిర్వహించేది సాధారణ మనుషులే కాబట్టి అలాంటివి రావడం సహజం. ఇదిలా ఉంటే ఈ దేశంలో ఏ వ్యవస్థ సంగతి ఎలా ఉన్నా ఈ రోజుకీ అంతా నమ్ముతున్న అత్యున్నత వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఒక్కటే.

ఈ రోజుకీ సామాన్యుడు తనకు న్యాయం జరుగుతుంది ఆ వైపుగా ఆశగా చూస్తారు. అక్కడ చెప్పిన తీర్పుని దేవుని తీర్పుగా భావించి శిరోధార్యం అంటాడు. అలాంటి అత్యున్నత వ్యవస్థ మీద కూడా రాజకీయ పడగ నీడ పడుతూ ఉంటుంది. అయితే దాన్ని ఉన్నతిని గొప్పతనాన్ని కాపాడుకోవాల్సింది ఆ వ్యవస్థలో ఉన్న వారే.

ఆ వ్యవస్థలో ధర్మమూర్తిగా ఉంటూ వచ్చిన వారే. ఈ దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ సుప్రీం కోర్టు. అక్కడ న్యాయమూర్తిగా పనిచేసినా లేదా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినా ఆ గౌరవమే వేరు. దానికి సరిసాటి పోటీగా వేరే పదవులు ఉండవే ఉండవు. అది రాజ్యాంగాన్ని కాపాడే అత్యున్నత వ్యవస్థ. మిగిలిన వ్యవస్థలు అన్నీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేవి.

అంటే ఇతర వ్యవస్థలకు న్యాయ వ్యవస్థకు అంతటి తేడా ఉంది. అలాంటి వ్యవస్థలో న్యాయమూర్తులుగా పనిచేసిన వారు విశ్రాంత న్యాయమూర్తులుగా ఉంటూ దేశానికి దశ దిశా చూపాల్సి ఉంటుంది. చాలా మంది అలాగే చేస్తున్నారు. కొందరు మాత్రం పదవులు అందుకుంటున్నారు. నిజానికి వారికి తీసుకోవాలని ఉందా లేక ఇస్తున్నారా అన్న సంగతి పక్కన పెడితే అలా పుచ్చుకున్నా ఇచ్చుకున్నా రెండూ ఇబ్బందికరమే అని అంటున్నారు.

ఎందుకంటే ఈ దేశంలో ఎవరు ఏమి చేసినా అందులో రాజకీయాన్నే చూస్తారు. వర్తమాన రాజకీయ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి శోధించి మరీ సోషల్ మీడియాలో వాదించే వారే ఉంటారు. ఇదంతా ఎందుకంటే లేటెస్ట్ గా కర్నాటకకు చెందిన సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి సయ్యద్ అద్బుల్ నజీర్ కి రిటైర్ అయిన నలభై రోజుల వ్యవధిలోనే ఏపీ గవర్నర్ గా పదవి లభించింది. ఆయన కర్నాటకకు చెందినవారు.

విశేష అనుభవం ఉన్న న్యాయ కోవిదుడు ఆయన. ఆయన ఎన్నో కీలక తీర్పులలో ఉన్నారు. అలాంటి ఆయనకు పదవి రావడంతోనే సోషల్ మీడియాలో విమర్శలు చేసే వారు సత్య శోధన చేసే వారు ఎక్కువ అయ్యారు. ఇక ఆయన గతంలో ఇచ్చిన తీర్పులను కూడా మళ్లీ ముందుకు తెచ్చి చర్చిస్తున్నారు. నిజంగా ఇదంతా అవసరమా అని కూడా అనిపిస్తుంది.

న్యాయమూర్తులు పదవులు తీసుకోవడం వల్లనే ఇపుడు వస్తున్న అనవసర రాద్ధాతం ఇదంతా అని అంటున్నారు. అసలు ఇది ఎలా మొదలైంది అంటే 2014లో మోడీ దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక నాడు సీజేఐగా బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన జస్టిస్ సదాశివం ని కేరళ గవర్నర్ గా నియమించారు. దీని మీద నాడే ప్రత్యర్ధులు తటస్థులు విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి.

అయినా ప్రభుత్వం లక్ష్యపెట్టలేదు. ఇక సీజేఐ వంటి ఉన్నత పదవిని నిర్వహించిన సదాశివం గవర్నర్ పదవిని తీసుకోవడం ద్వారా ఈ ఒరవడికి తోవ ఇచ్చారని అంటున్నారు. ఆ తరువాత మరో సీజేఐ రంజన్ గగోయ్ కూడా సీజేఐ గా పనిచేసి పదవీ విరమణ చేసిన వెంటనే ఆయనను బీజేపీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. ఇపుడు అబ్దుల్ నజీర్.

ఇలా వరస చూస్తూంటే సుప్రీం కోర్టులో ఉన్నత పదవులు నిర్వహించిన వారినే బీజేపీ ఎంచుకుని పదవులు ఆఫర్ చేస్తోంది. అయితే ఈ పదవులు వారు చేపట్టకూడదు అని ఎక్కడా లేదు. పైగా నిబంధలను కూడా ఏమీ లేవు వారికి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ వారు ఈ దేశంలో అతి ముఖ్యమైన వ్యవస్థకు ఊపిరిగా నిలిచిన వారు.

వారు న్యాయమూర్తులుగా ఉంటూ న్యాయాన్ని బతికించిన వారు. తరువాత కాలంలో రాజకీయ నేతలు అధిష్టించే పదవుల లోకి రావడం వల్ల వారి విలువ ఏమీ పెరగదు సరికదా తగ్గుతుందనే అంతా అంటున్నారు. ఇక కాదేదీ రాజకీయం అన్నట్లుగా ఏ పార్టీ అయినా ఇలాంటి ప్రాక్టీస్ నే చేస్తుంది. కానీ వద్దు అని చెప్పాల్సింది ఆ ఉన్నత స్థానంలో ఉన్న వారే.

ఎందుకంటే వారు ఆ పదవులు తీసుకోవడం వల్ల వారి మీద అనవసర చర్చ. వారు ధర్మంగా తీర్పులు ఇచ్చినా అందులో సందేహాలు అనుమానాలు చూపులు చూసే తెంపరి తనంతో ఉండేవారు ఉన్నారు. కాబట్టి తమకు తామే స్వీయ నియంత్రణను విధించుకుని మాకు పదవులు వద్దు అని వారే తిరస్కరిస్తే తప్ప ఈ దుస్సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పడదనే అంటున్నారు. నిజానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి కంటే ఉన్నత పదవి వేరేది ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.