Begin typing your search above and press return to search.

అప్పుడేమో నిప్పులు.. ఇప్పుడేమో మౌనమేంటి కేసీఆర్?

By:  Tupaki Desk   |   22 Sept 2020 2:00 PM IST
అప్పుడేమో నిప్పులు.. ఇప్పుడేమో మౌనమేంటి కేసీఆర్?
X
లాగి పెట్టి కొట్టినట్లుగా.. లక్ష్యాన్ని సూటిగా తాకేలా మాట్లాడటం అందరికి చేతకాదు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న టాలెంట్ ఎంతో అందరికి తెలిసిందే. ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదన్న సామెతకు తగ్గట్లే.. కేసీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఉత్తినే ఉండదు. దాని వెనుక చాలానే లెక్కలు ఉంటాయి. ఆచితూచి.. ఎప్పుడేం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడే ఆయన.. తర్వాత మాత్రం మౌనంగా ఉంటారు.

వ్యవసాయ బిల్లుపై నిప్పులు చెరగటమే కాదు.. కేంద్రం తీరును తప్పు పట్టటం.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తేనె పూసిన కత్తి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు విపరీతమైన ప్రాధాన్యత లభించింది. అందరి చూపు తన మీద పడేసుకున్నారు. మరింత చేసిన ఆయన.. వ్యవసాయ బిల్లును ఆమోదించే క్రమంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఒక్క మాట మాట్లాడకుండా ఉండటం కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వ్యవసాయ బిల్లును రాజ్యసభలో ఆమోదించిన తర్వాత విపక్షాలు పెద్ద ఎత్తున మండిపడటమే కాదు.. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల్ని నిర్వహిస్తామని.. ఆందోళనలు చేపడతామని ఎవరికి వారుగా తమ కార్యాచరణను ప్రకటిస్తున్నారు. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ అయితే.. భారీ ప్రణాళికనే ప్రకటించారు. బిల్లుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ సైతం ఏ మాత్రం తగ్గలేదు. తాము రెండు కోట్ల మంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రాన్ని సమర్పిస్తామన్నారు.

ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25న దేశ వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని సీపీఐ.. సీపీఎం.. ఆర్ ఎస్ పీ.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇన్ని పార్టీలు ఇంతలా తమ కార్యాచరణ ప్రకటిస్తే.. కేసీఆర్ మాత్రం కామ్ ఉండటం గమనార్హం. తేనె పూసిన కత్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. అందుకు కొనసాగింపు వ్యాఖ్యలు చేయరా? అన్నది క్వశ్చన్ గా మారింది. అందరి కంటే ముందు విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్న వేళ మాత్రం.. కామ్ గా ఉండిపోవటం గులాబీ బాస్ కే చెల్లుతుందన్న మాట వినిపిస్తోంది.