గతంలో మాదిరి ఇప్పటి రాజకీయాలు లేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి తక్కువలో తక్కువ రూ.20 కోట్ల నుంచి రూ.30కోట్ల వరకు ఖర్చు చేశారు. మరికొందరైతే రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారంటే నమ్మరు. కానీ.. ఇది నిజం. అంతదాకా ఎందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా బరిలోకి నిలిచిన ప్రముఖ పార్టీ అభ్యర్థులు రూ.3 నుంచి రూ.4కోట్ల వరకు ఖర్చు చేయటం చూసినప్పుడు.. రాజకీయాలు ఎంత ఖరీదైనవిగా మారాయో చెప్పలేని పరిస్థితి. ఇంత భారీగా నిధులు సమీకరణ.. వాటిని గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేయటం లాంటివి రజనీ లాంటి వ్యక్తికి మనస్కరించకపోవచ్చు. అంతేకాదు.. అంత మొత్తాన్ని సమీకరించటంకూడా చిన్న విషయం కాదు.
ఇప్పటి రాజకీయం వెనుక వేలాది కోట్ల రూపాయిల ప్రయోజనాలు ఉంటాయన్నది సత్యం. అందునా తమిళనాడు లాంటి ఆర్థికంగా స్థితిమంతమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం అంత తేలికైన విషయాలు కావు. జాతీయ స్థాయి రాజకీయాల్ని ప్రభావితం చేసే ఎంపీ సీట్లు ఉన్నప్పుడు.. అంత సింఫుల్ గా వదిలిపెట్టే అవకాశం లేదు. తమిళనాడులో ఉన్నప్పుడు రజనీకి సన్నిహితంగా ఉండి హితబోధ చేసే అవకాశం లేకపోవచ్చు. ఎప్పుడైతే ఆయన హైదరాబాద్ కు షూటింగ్ కోసం వచ్చారో.. ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని తెర వెనుక చాలానే చర్చలు జరిగి ఉండొచ్చు. వాటి సారాంశంతోనే రజనీ మనసు మార్చుకొని ఉండొచ్చు. ఇక్కడ దేనిని కొట్టిపారేయలేని పరిస్థితి.
70 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి రావటం సామాన్యమైన విషయం కాదు. ఎంత మనోధైర్యం ఉన్నప్పటికి.. ఆరోగ్యం సహకరించాలిగా? అప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్న వారికి.. తరచూ ఎదురయ్యే సమస్యల్ని డీల్ చేసే శక్తి సామర్థ్యాలు.. ఆ వయసులో ఉండే అవకాశం ఉందా? అన్నది మరో ప్రశ్న. టీడీపీ అధినేత చంద్రబాబు సంగతే తీసుకోండి. ప్రస్తుతం ఆయనకు ఇప్పుడు 70 ఏళ్లు. 2019లో జరిగిన ఎన్నికల్లో దారుణ పరాజయానికి గురయ్యారు. అంతే.. అప్పటివరకు లెక్కలోకి రాని ఆయన వయసు ఇప్పుడు తెర మీదకు రావటమే కాదు.. ఆయన రాజకీయ వారసుడి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో తెలిసిందే. మొత్తంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లుగా ప్రచారం చేసే వారు లేకపోలేదు.
ఇదే రజనీకాంత్ ఒక ఇరవై ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి.. అందుకు తగినట్లుగా పావులు కదిపి ఉంటే.. ఇప్పుడు ఎదురైన ఎన్నో అంశాల్ని ఆయన తేలిగ్గా తేల్చేసి ఉండేవారు. సహకరించని వయసు.. అంతకు మించి కుటుంబ సభ్యులు ఎవరూ అండగా నిలవకపోవటం తన నిర్ణయాన్ని మార్చుకోవటానికి కారణమై ఉంటారు. దిగిన తర్వాత కానీ లోతు తెలీదన్నట్లుగా రాజకీయ పార్టీ పెడతానని చెప్పిన తర్వాత నుంచి ఆయనకు ఎదురైన అనుభవాలే.. రజనీని వెనక్కి తగ్గేలా చేసి ఉంటాయి. రజనీ పొలిటికల్ ఎంట్రీతోనే సక్సెస్ కొట్టేస్తారన్న మాట చెప్పలేం కానీ.. ఆయన మార్కు మాత్రం అంతో ఇంతో ఉండేది. అది.. ఆయనకు ప్రయోజనం కలిగించినా.. లేకున్నా.. కొందరి ప్రయోజనాల్ని దెబ్బ తీయటం ఖాయం. ఇది కూడా.. తాజా ప్రకటన వెనుక కీలకమై ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వారు లేకపోలేదు.
గడిచిన మూడేళ్లుగా గ్రౌండ్ వర్కు చేసిన రజనీ రాజకీయ పార్టీని ప్రకటిస్తానని చెప్పి.. వెనక్కి తగ్గటానికి కారణాల్ని తన లేఖలో ప్రస్తావించారు. చెప్పకనే చెప్పినట్లుగా ఆయన లేఖలోని అంశాలు ఉన్నాయని చెప్పాలి. ఆయన పేర్కొన్న వ్యాఖ్యల్ని జాగ్రత్తగా చదివితే చాలానే విషయాలు అర్థమవుతాయి. అభిమానులకు ఆయన రాసిన లేఖ సారాంశంలోని అంశాలు..
‘‘నాకు జీవితాన్ని ప్రసాదిస్తున్న దైవసమానులైన తమిళ ప్రజలకు నా కృతజ్ఞతలు. జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించి, వైద్యుల సూచనలను సైతం కాలదన్ని ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లాను. సుమారు 120 మందితో షూటింగ్ చేశాం. ప్రతిరోజూ కరోనా పరీక్షలు చేయించుకుంటూ, ఎవరికి వారు క్వారంటైన్‌లో వుంటూ, మాస్కు ధరించి, చాలా జాగ్రత్తలతో షూటింగ్ చేశాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నలుగురికి పాజిటివ్ అని తేలింది. వెంటనే షూటింగ్ నిలిపేయగా, నాతో పాటు అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. కానీ రక్తపోటు అధికమైంది’’
‘‘ఇప్పటికే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని వున్నందున రక్తపోటు హెచ్చుతగ్గులుగా ఉండకూడదని వైద్యులు చెప్పారు. వారి సూచనల మేరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. నా ఆరోగ్య పరిస్థితిని చూసి ప్రొడ్యూసర్ కళానిధిమారన్ షూటింగ్ వాయిదా వేయడంతో అనేకమందికి జీవనోపాధి పోయింది. కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లింది. వీటన్నింటికీ కారణం నా ఆరోగ్య పరిస్థితే. ఇది దేవుడు నాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నా’’
‘‘నేను పార్టీ ప్రారంభించాక మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే ప్రచారం చేస్తే అది ప్రజల్లోకి వెళ్లదు. నేను అనుకున్న విజయాన్ని సాధించలేను. ఈ నిజాన్ని రాజకీయ అనుభవమున్న వారెవ్వరూ కాదనలేరు. రాజకీయ ప్రవేశం చేశాక సమావేశాలు నిర్వహించి, ప్రచారంలో భాగంగా లక్షలాదిమందిని కలుసుకోవాల్సి వస్తుంది. 120 మందితో కూడిన బృందంలోనే కరోనా పాజిటివ్ వచ్చి నేను మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ కరోనా కొత్తరూపం సంతరించుకుంది’’
‘‘వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటికే రోగ నిరోధక శక్తి పెంచే మాత్రలను తీసుకుంటున్నాను. అలాంటప్పుడు ప్రజలను నేరుగా కలుసుకుని ప్రచారం చేస్తే నాకూ, దాని వల్ల ప్రజలకు వైరస్ వ్యాపించే ప్రమాదం వుంది. నాతో పాటు రాజకీయ ప్రయాణం చేసే వారికి కూడా పలు ఇబ్బందులు, సమస్యలు తెచ్చినట్టే అవుతుంది. వారు మానసికంగా, శారీరకం గానూ, ఆర్థికంగానూ సమస్యలు ఎదుర్కొవాల్సి వుంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదని భావిస్తున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను ఇచ్చిన మాటను మాత్రం తప్పను’’
‘‘నేను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి, ఇప్పుడు రావడం లేదని చెబితే ఎవరో ఏదో అంటారని నన్ను నమ్మి నాతో వచ్చిన వారిని బలిపశువుల్ని చేయడం ఇష్టం లేదు. అందువల్ల పార్టీని ప్రారంభించి, రాజకీయాల్లోకి రాలేకపోతున్నా. ఈ విషయాన్ని ఎంతో వేదనతో చెబుతున్నా. దీనిని ప్రకటించేటప్పుడు నేనెంత బాధ పడ్డానో నాకు తెలుసు. నా నిర్ణయం ‘రజనీ మక్కల్ మండ్రం’ కార్యకర్తలకు, నేను పార్టీ ప్రారంభిస్తానని ఎదురు చూస్తున్న నా అభిమానులకు, ప్రజలకు నిరాశ కలిగిస్తుందని తెలుసు’’
‘‘నన్ను క్షమించండి. నా మాటకు కట్టుబడి రజనీ మక్కల్ మండ్రం వారు గత మూడు సంవత్సరాలుగా ఎంతో క్రమశిక్షణతో, నిజాయతీగా కరోనా కాలంలోనూ నిరాటంకంగా ప్రజలకు సేవ చేశారు. ఆ పుణ్యం ఎప్పటికీ వృధా కాదు. అది మిమ్మల్ని, మీ కుటుంబీకులను కాపాడుతుంది. నవంబర్ 30వ తేదీన నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మీరంతా ఒకే మాటగా ‘మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే’ అని చెప్పిన మాటలు నా జీవితాంతం మర్చిపోలేను. మీరు నామీద పెట్టుకున్న అభిమానానికి, ప్రేమకు, శిరసు వంచి నమస్కరిస్తున్నా. రజనీ మక్కల్ మండ్రం ఎప్పటిలాగే కొనసాగుతుంది.
‘‘మూడు సంవత్సరాలుగా ఎన్ని విమర్శలు వచ్చినా నిరాటంకంగా నన్ను ఆదరించి, మొదట నా ఆరోగ్యం సంగతి చూసుకోమని అభిమానంతో చెప్పిన తమిళరువి మణియన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక పెద్ద పార్టీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ, నేను అడగ్గానే దాని నుంచి వైదొలగి, నాతో కలసి పనిచేసేందుకు వచ్చిన అర్జున మూర్తికి కృతజ్ఞతలు. రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజలకు ఏం చేయగలనో ఆ మేరకు సేవ చేస్తాను. నేను నిజాలు మాట్లాడేందుకు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు’’
‘‘నిజాన్ని నిర్మొహమాటంగా మాట్లాడడాన్ని ఇష్టపడే వారు, నా ఆరోగ్యంపై శ్రద్ధ వున్న వారు, నన్ను బ్రతికించే నా దేవుళ్లయిన నా అభిమానులు, తమిళనాడు ప్రజలు ఈ నిర్ణయాన్ని ఆమోదించాలని అభ్యర్థిస్తున్నా’’ అంటూ తన సుదీర్ఘ లేఖను ముగించారు. ఇదంతా చదివినప్పుడు రజనీ తన గురించి కన్నా.. తన చుట్టుపక్కల వారి గురించి ఆలోచించటాన్ని అండర్ లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మరింత లోతుగా చూసినప్పుడు కొన్ని విషయాలు అర్థమయ్యే అవకాశం ఉంది. కరోనా రాక ఎలా అయితే మిస్టరీనో.. రజనీ రాజకీయ రంగప్రవేశం.. అంతలోనే ఎగ్జిట్ అయిపోవటం మాత్రం ప్రస్తుతానికి మిస్టరీనే. ఆయన లేఖలో చెప్పిన విషయాలకు తోడుగా చెప్పని విషయాలు చాలానే ఉంటాయన్నది నిజం. ఇదంతా చూసినప్పుడు రీల్ సూపర్ స్టార్.. పొలిటికల్ డిజాస్టర్ కు సిద్ధం కావటం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయంగా చెప్పాలి. ఆయన ఎంట్రీ చాలామందికి ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు.. అయితే.. తాను పార్టీ పెట్టిన తర్వాత చోటు చేసుకునే పరిణామాలే ఆయన్ను ఆలోచించేలా చేయటమే కాదు.. వెనక్కి తగ్గేలా చేసి ఉంటాయన్నది నిజం.