Begin typing your search above and press return to search.

చింతమనేని ఇపుడేమంటారు ?

By:  Tupaki Desk   |   8 July 2022 10:14 AM IST
చింతమనేని ఇపుడేమంటారు ?
X
కోళ్ళ పందేలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. లేని మనిషిని ఉన్నట్లుగా చెప్పే రాక్షస రాజకీయం ఎందుకు చేస్తున్నారంటు మండిపడ్డారు. కేసీయార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు తొందరలోనే కూలిపోతాయని శాపనార్ధాలు పెట్టారు. రాజకీయాలన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి కానీ ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటు నిలదీశారు. కట్ చేస్తే ఇపుడు ఈ మాజీ ఎంఎల్ఏ నోరు లేవటమే లేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే పటాన్చెరువు మండలం శివార్లలోని చినకంజర్ల తోటలో కోళ్ళపందేలు జరుగుతున్నాయని తెలిసి పోలీసులు దాడులుచేశారు. ఈ దాడుల్లో 21 మందిని పట్టుకోవటమే కాకుండా రు. 13 లక్షలు, కొన్ని వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వారిని విచారించిన తర్వాత కోళ్ళపందేలని నిర్వహించింది దెందులూరు మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకరే అని పోలీసులు ప్రకటించారు. చింతమనేని పరారీలో ఉన్నారని ఆయన కోసం గాలింపు జరుగుతోందని పోలీసులు బుధవారం ఉదయం ప్రకటించారు.

అయితే హఠాత్తుగా చింతమనేని ఫేస్ బుక్ లైవ్లో ప్రత్యక్షమై పోలీసులను, కేసీయార్, జగన్ను శాపనార్ధాలు పెట్టారు. కోళ్ళపందేలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సీన్ కట్ చేస్తే సాయంత్రం పోలీసులు ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో కోళ్ళపందేలు జరుగుతున్న ప్రాంతంలో చింతమనేని స్పష్టంగా కనబడుతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న చింతమనేని అక్కడి నుండి వెళ్ళిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనబడ్డాయి.

తానే కోళ్ళపందేలను నిర్వహించి, పోలీసులు వస్తున్నట్లు తెలుసుకుని అక్కడినుండి పారిపోయిన చింతమనేని ఇపుడు వీడియోలు చూసిన తర్వాత ఏమంటారు ? బహుశా వీడియో మార్ఫింగ్ చేసినట్లు మళ్ళీ ఆరోపిస్తారేమో.

ఎక్కడివో వీడియోలను పోలీసులు సంపాదించి చినకంజర్ల తోటల్లోదని పోలీసులు చెబుతున్నట్లు చెప్పినా చెబుతారని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వివాదాల్లో ఇరుక్కోవటం ఏదన్నా పెద్ద గొడవైతే ఆ వివాదంతో తనకు ఎలాంటి సంబంధంలేదని బుకాయించటం చింతమనేనికి అలవాటే వారు విమర్శిస్తున్నారు. మరీసారి ఏమని చెబుతారో చూడాలి.