Begin typing your search above and press return to search.

జగన్ అడకత్తెరలో పోకచెక్కలా చంద్రబాబు?

By:  Tupaki Desk   |   26 Dec 2019 6:16 AM GMT
జగన్ అడకత్తెరలో పోకచెక్కలా చంద్రబాబు?
X
ఏపీకి మూడు రాజధానులు అవసరం అని ప్రకటించిన సీఎం జగన్ మాస్టర్ స్ట్రోక్ తో ఇప్పుడు ప్రతిపక్ష చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట. అమరావతిని మార్చడంపై టీడీపీ ఉద్యమించడం.. మార్చకూడదని చంద్రబాబు రచ్చ చేయడం తెలుగు దేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉత్తరాంధ్ర - సీమ టీడీపీ నేతలు చంద్రబాబుకు వ్యతిరేకంగా గళమెత్తారు.. చంద్రబాబు ఈ 3 రాజధానుల నిర్ణయంతో డిఫెన్స్ లో పడిపోయాడన్న చర్చ జరుగుతోంది.

విశాఖపట్నాన్ని జగన్ పరిపాలన రాజధానిగా ప్రకటించనప్పటి నుంచి చంద్రబాబు దీనికి మద్దతు ఇవ్వాలా లేదా వ్యతిరేకించాలా అనేదానిపై నిర్ణయం తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాన్ని సమర్థించకుండా.. వ్యతిరేకించకుండా మౌనం దాల్చాడు. చంద్రబాబు కనుక వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ప్రజలను దూరం చేసుకున్న వాడవుతాడు. ఒకవేళ మద్దతిస్తే అమరావతి.. దాని చుట్టపక్కల మద్దతుదారులకు విలన్ గా మారిపోతాడు..

అమరవతికి మద్దతు ప్రకటించి విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తాజాగా ఉత్తరాంధ్రలో పర్యటనకు నిర్ణయించుకొని ఖరారు కూడా చేసుకున్నాడట.. కానీ తాజాగా ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు బాబు విజయనగరం పర్యటనను వాయిదా వేసుకోవాలని సలహా ఇచ్చారట.. దీంతో జనవరి 2 - 3 తేదీల్లో చంద్రబాబు విజయనగరం పర్యటనను రద్దు చేసుకోవడం సంచలనంగా మారింది.

ఉత్తరాంధ్రకు చెందిన చాలామంది టీడీపీ నాయకులు వైఎస్ జగన్ ‘విశాఖ రాజధాని’ ప్రకటనకు బహిరంగ మద్దతు ఇస్తున్నారు. టీడీపీ సీనియర్ - మాజీ మంత్రి గంటా - బాలయ్య అల్లుడు భరత్ - సీనియర్ నేత కొండ్రు మురళి ఇప్పటికే వైజాగ్ రాజధానికి జైకొట్టారు. చాలా మంది ఉత్తరాంధ్ర నాయకులు జగన్ నిర్ణయానికి మద్దతు తెలిపారు. వైజాగ్ ను చంద్రబాబు వ్యతిరేకిస్తే పార్టీని వీడుతామని కొందరు హెచ్చరికలు కూడా జారీ చేయడం విశేషం.

జగన్ వేసిన ఈ 3 రాజధానుల నిర్ణయంలో ఇప్పుడు చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. అందుకే తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనను ఉద్రిక్తతల నడుమ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రాయలసీమ పర్యటనను కూడా చంద్రబాబు రెండు మూడు సార్లు ఆలోచించుకొనే బయలు దేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.