Begin typing your search above and press return to search.

మోడి గురించి ఎందుకు మాట్లాడటం లేదు ?

By:  Tupaki Desk   |   16 Feb 2021 11:30 AM GMT
మోడి గురించి ఎందుకు మాట్లాడటం లేదు ?
X
విశాఖ ఉక్కు విషయంలో ప్రతిరోజు చంద్రబాబునాయుడు కానీ టీడీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు కానీ నరేంద్రమోడిని పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. ఉక్కును ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకన్న ప్రధానమంత్రి మోడిని ఎందుకు టార్గెట్ చేయటం లేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. అప్పటికేదో ఉక్కు రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిది అయినట్లు, దాన్ని జగన్ ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది చంద్రబాబు ఆరోపణలు వింటుంటే.

తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఉక్కును జగన్ తన కేసుల మాఫీ కోసమే ప్రైవేటీకరిస్తున్నట్లు ఆరోపించటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేస్తే జగన్ పైనున్న కేసులు మాఫీ అయిపోతాయా ? ఇందుకు కోర్టులు అంగీకరిస్తాయా ? నోటికేదొస్తే అది మాట్లాడేయటం, జగన్ మీద బురద చల్లేయటమే చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందులో నరేంద్రమోడిని నోరెత్తి ఒక్క మాటకూడా మాట్లాడకుండా ఎపిసోడ్ మొత్తంలో జగన్ను మాత్రమే విలన్ గా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ కనీసం మోడికి లేఖ అయినా రాశారు. చంద్రబాబు కనీసం ఆపని కూడా చేయలేదు. ఉక్కు గురించి అడగాల్సింది కేంద్రాన్ని అయితే టార్గెట్ చేసుకుంటున్నది మాత్రం జగన్ను. ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ఆందోళనలు చేయాల్సిందే, నిరసనలు, ఉద్యమాలు చేయాల్సిందే. కానీ ఆ కార్యక్రమాలన్నీ జగన్ టార్గెట్ గా కాకుండా నరేంద్రమోడి టార్గెట్ గా జరిగితేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది.

నిజానికి ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రప్రభుత్వం బాధ్యత ఉందంటే చంద్రబాబు, జగన్ ఇద్దరికీ సమాన బాధ్యతుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇన్ని మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు తన హయాంలో కనీసం 58 ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించేశారు. స్పిన్నింగ్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు, ఆల్విన్ లాంటి సంస్ధలన్నీ చంద్రబాబు హయాంలోనే ముందు ప్రైవేటకీరణ జరిగి తర్వాత మూతపడిపోయాయి. కాబట్టి చంద్రబాబు తన డిమాండ్ లో చిత్తశుద్ది ఉంటే కేంద్రాన్ని నిలదీయాలి. అంతేకానీ ప్రతిదానికి జగన్నే బూచిగా చూపిస్తే లాభంలేదు.