Begin typing your search above and press return to search.

బీజేపీ.. క్రికెటర్లపై ఇంత మోజు ఎందుకో!

By:  Tupaki Desk   |   17 March 2019 12:23 PM GMT
బీజేపీ.. క్రికెటర్లపై ఇంత మోజు ఎందుకో!
X
రాజకీయాల్లోకి వచ్చిన క్రికెటర్లందరూ సక్సెస్ కాలేదు. క్రికెట్ లో తమ సత్తా చూపించిన చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి సత్తా చూపించాలని ఉబలాటపడ్డారు. అయితే పాలిటిక్స్ లో క్రికెటర్ల సక్సెస్ రేటు తక్కువే. గత ఎన్నికల్లో కూడా కొంతమంది పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ తరఫున మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ రంగంలోకి దిగాడు. అతడి పరిస్థితి ఏమిటో తెలిసిందే. అలాగే అజారుద్దీన్ కూడా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు. ఇక ఈ సారి అజ్జూ పోటీకి కూడా అంత ఆసక్తి చూపలేదు. తప్పకున్నట్టే.

ఇక కాంగ్రెస్ వాళ్లు క్రికెటర్లను ఇప్పుడు పట్టించుకోవడం లేదు కానీ.. బీజేపీ మాత్రం వారి కోసం తెగ ఆరాటపడుతూ ఉంది. టీమిండియా తరఫున సత్తా చాటిన పలువురు క్రికెటర్ల కోసం కమలం పార్టీ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తూ ఉండటం విశేషం.

వారిలో ఇప్పుడు బీజేపీ కన్ను గీటుతోంది హర్భజన్ సింగ్ కోసం. పంజాబ్ నుంచి ఈ సర్దార్జీని పోటీ చేయించాలని కమలం పార్టీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. ఈ మేరకు భజ్జీతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతూ ఉన్నారని సమాచారం.

ఇది వరకూ బీజేపీకి పంజాబ్ లో ఒక మాజీ క్రికెటర్ తోడుగా ఉండే వాడు. అతడే సిక్సర్ల సిద్ధూ. రాజకీయంగా సత్తా చూపించిన ఈ క్రికెటర్ చాలా సంవత్సరాల పాటు బీజేపీలో యాక్టివ్ పొలిటీషియన్ గా వ్యవహరించారు. అయితే.. కొన్నాళ్ల కిందట ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లారు. సిద్దూ అటు వెళ్లగానే ఆ పార్టీ నెగ్గింది. సిద్దూ మంత్రి కూడా అయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ లోనే మరో క్రికెటర్ ను రాజకీయ నేతగా మార్చే ప్రయత్నంలో ఉంది బీజేపీ. అందుకే భజ్జీని గోకుతున్నట్టుగా ఉంది.

కేవలం హర్బజన్ ను మాత్రమే కాదు.. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ లను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని బీజేపీ ఉబలాటపడుతూ ఉంది. ప్రస్తుతానికి అయితే వారి నుంచి అంత సానుకూల సంకేతాలు అందటం లేదు!