Begin typing your search above and press return to search.

సౌత్ ఇండియా మీద బీజేపీ చిన్నచూపా?

By:  Tupaki Desk   |   10 Dec 2019 4:32 AM GMT
సౌత్ ఇండియా మీద బీజేపీ చిన్నచూపా?
X
ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. తెలంగాణ కు న్యాయంగా కేంద్రం ఇచ్చే జీఎస్టీ వాటా సుమారు 20వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. ఇప్పటివరకు 10వేల కోట్లే ఇచ్చారని.. మిగతావి విడుదల చేయాలని కేంద్రమంత్రులకు విన్నవించారు. స్పందన లేకపోవడంతో నిట్టూర్చారు. ట్విట్టర్ లోనూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కు కేంద్రంలోని బీజేపీ నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఇక తెలంగాణ ఒక్క రాష్ట్రానికే ఈ బాధ కాదు.. ఏపీ, కేరళ, తమిళనాడు పరిస్తితి కూడా ఇంతే.. బీజేపీ ఆనవాళ్లు లేని రాష్ట్రాలకు నిధుల్లో తీవ్ర వివక్ష కొనసాగుతుందని స్వయంగా ఆ రాష్ట్రాల బాధ్యులే ఆరోపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది..

బలం ఉన్న చోట బలగం.. అధికారం ఉంటుందంటారు.. ఇప్పుడు తమను గెలిపించి అందలమెక్కించిన ఉత్తరాది వారికే బీజేపీ చేస్తోందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.. దేశాన్ని ఏలుతున్న వారు కూడా ఉత్తరాది వారే కావడంతో దక్షిణాది గొంతుకు వినిపించని పరిస్థితి ఇప్పుడు కేంద్రంలో నెలకొంది. యూపీ సహా హర్యానా, బీహార్ ఉత్తరాఖండ్ ఇలా బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధుల వరద పారుతోందన్న విమర్శలున్నాయి. లెక్కల్లోనూ ఆ రాష్ట్రాల్లోకే దోచిపెడుతున్నట్టు దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.

ఇక మోడీ తొలి ప్రభుత్వం లో బీజేపీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది.అప్పుడు ఆ రాష్ట్రాలకు కూడా నిధుల వరద పారేది. తెలంగాణ, ఏపీ మొత్తుకుంటున్నా.. ఇక్కడి సీఎంలు ప్రధాని మోడీ, హోమంత్రి షాలను కలుస్తున్నా కూడా నిధులు విదిల్చలేని దుస్థితి నెలకొంది. న్యాయంగా వాటా ప్రకారం రావాల్సినవి కూడా ఆగుతున్న పరిస్థితి ఉందంటున్నారు.

ప్రధానంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల బలం ఎక్కువ. ఇక్కడ బీజేపీని గెలిపించే పరిస్థితి లేదు. అందుకే తమను గెలిపించని ప్రజలపై ముఖ్యంగా దక్షిణాదిపై బీజేపీ శీతకన్ను వేసిందని సౌత్ ఇండియన్స్ ఆరోపిస్తున్నారు.

తాజాగా ఇదే విషయంపై ‘‘తుపాకీ.కామ్’’ పోల్ నిర్వహించింది. ‘సౌత్ ఇండియాపై బీజేపీ చిన్న చూపు చూస్తుందా’ అని పాఠకులను కోరితే ఏకంగా 90.51శాతం మంది అవును అని సమాధానమిచ్చారంటే బీజేపీ వివక్షపై ప్రజలు ఎంత రగిలిపోతున్నారో అర్థమవుతోంది. బీజేపీ చిన్న చూపు చూడడం లేదని కేవలం 7.35శాతం మంది మాత్రమే చెప్పడం గమనార్హం. ఇక ఏమో తెలియదు అని 2.13శాతం మంది ఈ ప్రశ్న నుంచి తప్పించుకున్నారు.

ఇలా రాజకీయ నేతలు, విశ్లేషకుల్లోనే కాదు.. సామాన్యుల్లోనూ దక్షిణాది పై బీజేపీ చిన్న చూపు కొనసాగిస్తుందని తేటతెల్లమైంది. మరి ఈ వివక్ష కు ముగింపు ఎప్పుడు పడుతుందనేది వేచిచూడడమే తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. ఉత్తరాది ప్రాబల్యం దేశ రాజకీయాల్లో పెరిగినంత కాలం మనం నిమిత్త మాత్రులుగానే మిగిలి పోతామనడంలో ఎలాంటి సందేహం లేదు..