Begin typing your search above and press return to search.

అవినీతి జరగనపుడు విచారణ భయమెందుకు?

By:  Tupaki Desk   |   13 Sep 2020 7:30 AM GMT
అవినీతి జరగనపుడు విచారణ భయమెందుకు?
X
తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విచిత్రమైన వాదన మొదలుపెట్టారు. టిడిపి హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్) విచారణ చేయించాలని అనుకున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ టిడిపి నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్ - వర్లరామయ్య కోర్టులో కేసు వేశారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఇదే విషయమై యనమల మాట్లాడుతూ చంద్రబాబు - టిడిపి పై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించటమే విచిత్రంగా ఉంది. ఇన్ సైడర్ ట్రేడిండ్ ఆరోపణలు వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి చేస్తునే ఉంది. తాము అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ చేయిస్తానని జగన్ అప్పట్లోనే ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

దానికి తగ్గట్లే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ చేయించారు. తర్వాత సమగ్ర విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేస్తే అది కక్షసాధింపు చర్య ఎలాగవుతుందో యనమలే చెప్పాలి. ఒకవైపు తాము అధికారంలోకి వస్తే ఇప్పటి మంత్రులు - ఎంఎల్ ఏలను జైళ్ళకు పంపుతామని చంద్రబాబునాయుడు - చినబాబు ఒకవైపు చెబుతున్నారు. ఇంతకింతా బదులు తీర్చుకుంటామని, ప్రతీకార చర్యలు చేసి తీరుతామని బెదిరిస్తున్నారు. అంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తామో చెప్పవచ్చు కానీ జగన్ మాత్రం టిడిపి హయాంలో జరిగిన అవినీతి - అక్రమాలపై విచారణ చేయకూడదా అంటూ వైసిపి నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం కోర్టు విచారణలో ఉండగానే సిట్ నివేదిక బయటపెట్టడం కోర్టు ధిక్కరణ అవుతుందని యనమల చెప్పటం భలేగా ఉంది. నిజంగానే కోర్టు ధిక్కారానికి జగన్ ప్రభుత్వం పాల్పడితే ఆ విషయమేదో కోర్టే చూసుకుంటుంది కదా. మధ్యలో యనమలకు ఎందుకు బాధ. నివేదిక బయటపడిందనే అసలు బాధంతా అని అర్ధమవుతోంది. తన అవినీతిని బయటపెట్టారన్న కక్షతోనే జగన్ ఇపుడు చంద్రబాబు - టిడిపిపై కక్షసాధిస్తున్నట్లు లాజిక్ లేని ఆరోపణలు చేయటం విచిత్రమే. ఎందుకంటే జగన్ పై విచారణ జరుగుతున్న కేసుల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లో కూడా అవినీతి జరిగిందని నిరూపితం కాలేదు. అన్నీ కేసులు వివధ దశల్లో విచారణలో ఉన్నాయి. పైగా జగన్ పై నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితాలే అని జనాలకు అర్ధమైపోయింది.

అయిదేళ్ళ పాలనపై సబ్ కమిటిని నియమించిన చరిత్ర దేశం మొత్తం మీద ఎక్కడా లేదని యనమల చెప్పటం విడ్డూరమే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించాడని కదా జగన్ పై కేసులు నమోదైంది. తండ్రి అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే చనిపోయిన తర్వాతే కదా జగన్ పై కేసులు నమోదు చేసింది. అంటే వైఎస్ అధికారంలో ఉన్నప్పటి వ్యవహారాలపైనే కదా ఆ తర్వాత సిఎంలుగా ఉన్న వారు విచారణకు ఆదేశించింది. ఆ కేసుల్లోనే జగన్ కు వ్యతిరేకంగా టిడిపి కూడా ఇంప్లీడ్ అయ్యింది. అంటే అప్పట్లో జగన్ పై టిడిపి కూడా కక్షసాధింపునకు దిగిందని అర్ధమవుతోంది. మరి అదే పద్దతిలో ఇపుడు జగన్ వెళుతుంటే మాత్రం యనమల ఎందుకు గోల పెట్టేస్తున్నట్లు ?