భైంసా మీద మాట్లాడవేం అసద్?

Mon Feb 17 2020 11:15:00 GMT+0530 (IST)

why asaduddin not talking about bhaimsa incident

ఆవేశానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు గా వ్యవహరిస్తుంటారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అయ్యగారు నోరు తెరిచినంతనే సెక్యులరిజం.. మైనార్టీల హక్కులు అంటూ అదే పనిగా మాట్లాడే వ్యక్తి.. దేశంలోని ప్రజలందరి హక్కుల గురించి మాట్లాడతారా? లేదా? అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే పనిగా కొందరి గురించి ప్రస్తావిస్తూ.. ప్రధాని మోడీ అండ్ కో మీద నిప్పులు చెరిగే ఆయన.. వివాదాస్పద వ్యాఖ్యల్ని చేస్తుంటారు.ఇటీవల భైంసాలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఉదంతాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ జరిగిన పలు ఘటనల పై తెలంగాణ సర్కారు చేసిందేమీ లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దాడులతో అట్టుడుకిపోయిన భైంసాలో బాధితుల గోడు అసద్ లాంటి నేతలకు అస్సలు పట్టటం లేదంటున్నారు. దాడి ఎక్కడ జరిగినా.. ఎవరి మీద జరిగినా?.. బాధితుల పక్షాన నిలిచి.. వారి హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత మేధావి అసద్ లాంటోళ్లకు ఎక్కువ గా ఉండాలి.

కానీ.. ఆయన మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కొన్ని విషయాలు తనకు సంబందం లేనట్లుగా ఆయన వైఖరి ఉంటుంది. హింసాత్మక చర్యలకు పాల్పడింది ఎవరైనా సరే.. వారికి వ్యతిరేకం గా గళం విప్పాల్సిన అవసరం అసద్ కు ఎందుకు కనిపించటం లేదు? భైంసా లాంటి ఘటనపై ఆయన ఎందుకు పెదవి విప్పరు? బాధితుల పక్షాన నిలిచి పోలీసు అధికారుల్ని చర్యలు తీసుకోవాలని ఎందుకు ప్రశ్నించరు? అన్న సందేహాలకు మజ్లిస్ అధినేత ఎప్పుడు బదులిస్తారు?