Begin typing your search above and press return to search.

మనోళ్లను ఆ దేశాలు పంపించేస్తున్నాయ్

By:  Tupaki Desk   |   20 Nov 2020 7:00 AM GMT
మనోళ్లను ఆ దేశాలు పంపించేస్తున్నాయ్
X
ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వేవ్ లేకున్నా.. అమెరికా.. యూరప్ లోని దేశాలు మాత్రం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఊహించని పరిణామాలు.. మనం తేరుకునేలోపే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే మొదలైంది. విదేశాల నుంచి భారతీయులు పెద్ద ఎత్తున తిరిగి వచ్చేస్తున్నారు. నిజానికి మనోళ్లు తిరిగి వస్తున్నారు అనే కంటే.. వారే పంపించేస్తున్నారన్న మాట సరైనది. సెకండ్ వేవ్ కారణంగా వణుకుతున్న యూరప్ లోని పలు దేశాలు.. ఖైదీలను సైతం విడుదల చేస్తూ.. జైళ్లను ఖాళీ చేయిస్తున్నాయి. విదేశీ ఖైదీలనైతే.. వారి దేశాలకు తిప్పి పంపించేస్తున్నాయి.

ఇప్పుడలా వచ్చేస్తున్న వారిలో మన దేశం కూడా ఉంది. సెకండ్ వేవ్ ధాటికి రోజులో లక్షల్లో కేసులు నమోదువుతున్న వేళ.. కరోనా ఒత్తిడికి లోనవుతున్న పలు దేశాలు.. బాధితులకు వైద్య సాయం అందించలేని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. దీంతో.. విదేశీయుల్ని వీలైనంత ఎక్కువ మందిని తిరిగి వారి దేశాలకు పంపుతున్నారు. మన దేశానికి వస్తే.. విదేశాల నుంచి మనోళ్లు భారీగా వచ్చేస్తున్నారు. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇలా విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య రోజుకు 2వేల మంది వరకూ ఉన్నట్లు చెబుతున్నారు.

విదేశాల నుంచి ఢిల్లీ.. చెన్నై.. హైదరాబాద్.. బెంగళూరు లాంటి నగరాలకు వస్తున్న మనోళ్లు.. తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని పరీక్షించుకునేందుకు.. క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్రాలకు లేఖలు అందాయి. విదేశాల నుంచి వచ్చే వారిలో చాలాంమంది వద్ద డబ్బులు లేకపోవటంతో.. పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఫస్ట్ వేవ్ సమయంలోనూ విదేశాల నుంచి వచ్చే వారి పుణ్యమా అని కేసుల జోరు పెరగటం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న మనోళ్ల విషయంలో సరిగా స్పందించని పక్షంలో.. అందుకు భారీగా మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.