Begin typing your search above and press return to search.

ప్రపంచ దేశాల చూపులన్ని భారత్ వ్యాక్సిన్ పైనే ఎందుకు?

By:  Tupaki Desk   |   23 Nov 2020 5:45 AM GMT
ప్రపంచ దేశాల చూపులన్ని భారత్ వ్యాక్సిన్ పైనే ఎందుకు?
X
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కొద్దిరోజులుగా కీలక ప్రకటనలు కొన్నింటిని వింటున్నాం. ఫైజర్.. మోడెర్నా లాంటి కంపెనీలు తమ వ్యాక్సిన్ ప్రభావం 90 శాతానికి పైనే అంటూ చేస్తున్న ప్రకటనలు కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. 80 శాతం రాయితీ అంటూ ఊరించే ప్రకటన చేసి.. తీరా షాపునకు వెళితే.. షరతులు వర్తిస్తాయన్న మాటతో ఆశలు ఎలా అయితే నీరు కారుస్తారో.. ఫైజర్.. మోడెర్నా సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ పరిస్థితి ఇలానే ఉందంటున్నారు.

ఎందుకంటే.. వీటి ధరలు భారీగా ఉండటం.. ఈ వ్యాక్సిన్లను నిల్వ ఉంచే విషయంలో ఉన్న పరిమితులు ఆచరణలో అంత తేలికైన విషయం కాదని చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు భారత్ మీద పడింది. అమెరికా లాంటి ధనిక దేశం తప్పించి.. మిగిలిన వారెవరూ ఫైజర్.. మోడెర్నా వారి వ్యాక్సిన్ మీద ఆసక్తి చూపటం లేదు.

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ను ఉత్పత్తి చేయనున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వైపు ప్రపంచంలోని పేద.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు ఆశగా చూస్తున్నాయి. ఎందుకంటే.. ఈ వ్యాక్సిన్ రెండు డోసుల ధర రూ.వెయ్యి లోపు ఉండటం.. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద సులువుగా నిల్వ ఉంచుకునే సౌకర్యం ఉండటమే కారణమంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ కు బ్రిటన్ లో అనుమతులు ఇచ్చిన వెంటనే.. భారత్ లో కూడా దాన్ని అత్యవసర వినియోగానికి ఓకే చెప్పేయాలని భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కొవిషీల్డ్ కు అత్యవసర అనుమతుల కోసం డిసెంబరులో అప్లై చేసుకుంటామని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించిన రెండు రోజులకే కేంద్రం నుంచి వచ్చిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.