Begin typing your search above and press return to search.

ఆమె కన్నీళ్లు అబూ సలేం తప్పించుకునేలా చేశాయా?

By:  Tupaki Desk   |   19 Feb 2020 11:30 AM GMT
ఆమె కన్నీళ్లు అబూ సలేం తప్పించుకునేలా చేశాయా?
X
ముంబయి మాజీ పోలీసు కమిషనర్ రాకేశ్ మరియా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. పోలీసు అధికారిగా తనకు తెలిసిన విషయాల్ని పుస్తకం రూపంలో రాయటంతో.. అందులో పలు సంచలన.. ఆసక్తికర అంశాలు ఉండటంతో ఇప్పుడు ఆయన చెబుతున్న విషయాలన్ని హాట్ టాపిక్ గా మారాయి. అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం ఎలా పారిపోయాడన్న విషయాన్ని తాను రాసిన ‘‘లెట్ మి సే ఇట్ నౌ’’ పుస్తకంలో చెప్పుకొచ్చారు.

అబూ సలేం పారిపోవటం గురించి చెబుతూ.. తన జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పేమిటో చెప్పుకొచ్చారు. 1993లో ముంబయి లో వరుస పేలుళ్లు జరిగిన ఘటనలో 257 మంది మరణించారని.. ఆ సమయంలో తాను సీనియర్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనకు వాడిన ఆయుధాలు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇంట్లో దాచినట్లుగా తనకు సమాచారం వచ్చిందని.. దీంతో దర్యాప్తును షురూ చేశామన్నారు.

సంజయ్ దత్ ఇంట్లో నుంచి ఆయుధాల్ని తీసుకున్న వారిలో జైబున్నిసా ఖాజీ అనే మహిళ ఉందన్న పక్కా సమాచారం తనకు వచ్చిందన్నారు. ఆమెను ఎంక్వయిరీ నిమిత్తం స్టేషన్ కు పిలపిస్తే.. విచారణలో ఆమె భోరున ఏడ్చేసింది. తాను ఎదుర్కొన్న కష్టాల్ని ఏకరువు పెట్టింది. తీవ్రమైన భావోద్వేగానికి గురై ఏడవటం మొదలు పెట్టింది. ఆమె కన్నీళ్లకు కరిగిపోయా. ఆయుధాల గురించి తనకేమీ తెలీదని చెప్పింది. ఆమె మాటలు.. ఏడుపుతో సానుభూతి పెరిగింది. ఆమెను వెళ్లిపొమ్మని చెప్పా.

ఆమెను నమ్మటమే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఆయుధాల సరఫరాకు ఉపయోగించిన కారు ఓనర్ మీద ఫోకస్ పెట్టి అతన్ని విచారణకు పిలిస్తే.. జైబున్నిసా చెప్పింది అబద్ధమని తేలింది. వెంటనే.. ఆమెను మళ్లీ పిలిపించా. నా దగ్గరకు రాగానే లాగి పెట్టి కొట్టా. అప్పుడామె నిజం ఒప్పుకుంది. అబూ సలేం తనకు ఆయుధాలు ఇచ్చి దాచిపెట్టమని చెప్పాడని తెలిపింది. అతడి చిరునామా ఇచ్చింది. అక్కడికి వెళ్లేసరికి అతను పారిపోయాడు.

మేం ఆమెను వదిలిన వెంటనే.. అబూసలేం కు అన్ని విషయాలు చెప్పేసింది. దీంతో.. అతడు నేపాల్ మీదుగా దుబాయ్ పారిపోయాడు. తర్వాత అండర్ వరల్డ్ డాన్ గా మారి ముంబయిలోని ప్రముఖ బిల్డర్లు.. వ్యాపారులు.. సినీ ప్రముఖుల్ని బెదిరించి దోపిడీలకు పాల్పడ్డాడు అని చెప్పుకొచ్చారు. 2002లో పోర్చుగల్ లో అబూను అరెస్టు చేశారు. అతనికి పేలుళ్లు.. బెదిరింపులు.. హత్య కేసుల్లో 2015లో జీవితఖైదు పడింది. ప్రస్తతుం అతడు తలోజా సెంట్రల్ జైల్లో ఉన్న విషయాన్ని మరియా వెల్లడించారు. తన పుస్తకంలో ఇలాంటివెన్నో ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. ఇప్పుడా పుస్తకం సంచలనంగా మారింది.