Begin typing your search above and press return to search.

పవన్ ఒంటరిపోరు.. ఎవరికి లాభం.?

By:  Tupaki Desk   |   6 March 2019 2:30 PM GMT
పవన్ ఒంటరిపోరు.. ఎవరికి లాభం.?
X
సింహం సింగిల్ గానే వస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తొడకొడుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం ఇందులో ఏదో తిరకాసు ఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. గడిచిన 2014 ఎన్నికల్లో సొంతంగా గెలవలేని స్థితిలో చంద్రబాబు బీజేపీ-జనసేనతో పొత్తు పెట్టుకొని ఏపీలో అధికారం కొల్లగొట్టాడన్నది కాదనలేని వాస్తవం. అప్పుడు వైసీపీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కూటమి కట్టి బాబు వైసీపీని ఓడించాడు. నాలుగున్నరేళ్లు గడిచాయి. బాబు వైఖరి చూసి బీజేపీ కాలదన్నింది.. బాబు తత్త్వం బోధపడి పవన్ దూరమయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఆప్షన్ లేదు. ఒంటరిగా పోటీచేసేంత బలమూ లేదు.. అలాగని టీడీపీతో, వైసీపీతో కలవలేని స్థితిలో ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

మరి జనసేనాని ఏం చేయాలి.? అంటే ఓట్లు చీల్చాలి అనేదే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడని ఏపీ రాజకీయాలను నిశితంగా పరిశీలించే విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు. అవును... ఇప్పుడు పవన్ టార్గెట్ అధికారంలోకి రావడం కాదు.. అధికారం చేపట్టే పార్టీని దెబ్బతీయడమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ ను ఇటీవలే చంద్రబాబు మళ్లీ ఆహ్వానించాడు. పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అని జనసేనకు ఆఫర్ ఇచ్చాడు. కానీ పవన్ దీనిపై కుండబద్దలు కొట్టినట్టు చెప్పలేకపోయారు. ఒంటరి పోటీనే అని ముగించారు. ఇప్పుడు జనసేన-టీడీపీ కలిసినా జనాలు నమ్మరు.. ఓట్లు వేయరు. అంత తిట్టుకున్నాక మళ్లీ కలిస్తే ఎవరు నమ్ముతారు. అందుకే ఆ విశ్వసనీయతను ఎందుకు చెడకొట్టుకోవాలని టీడీపీ, జనసేన ప్రస్తుతానికైతే ఒంటరి జపం జపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ప్రతిపక్ష వైసీపీ నాయకులు కానీ.. రాజకీయ విశ్లేషకులు కానీ పవన్ కళ్యాణ్ ఒంటరిపోరును శీఘ్రంగా గమనిస్తున్నారు. తెరవెనుక చంద్రబాబు ప్లాన్ ఏమైనా ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పరిణామాలు చూస్తుంటే దీనికి బలం చేకూర్చేవిగానే ఉన్నాయి.

జనసేనాని పవన్ తాజాగా కావలి ఎమ్మెల్యే సీటును పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తికి ప్రకటించారు. ఆయన నియోజకవర్గంలో మంచి మనిషిగా పేరుంది. కష్టపడి పైకొచ్చి.. కోట్లకు అధిపతి అయ్యాడు. నియోజకవర్గంలో సేవలకే డబ్బంతా ఖర్చు చేస్తుంటాడు. ఈయన మొదటి టిడీపీ టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నించారట.. టీడీపీ ఒకదశలో ఇతని మీద కన్నేసి అభ్యర్థిగా బరిలోకి దించుతుందని ప్రచారం జరిగింది. కానీ సమీకరణాలు దృష్ట్యా సాధ్యపడలేదట. ఇప్పుడు ఇలాంటి మంచి మనషి జనసేన తరుఫున కావలి నుంచి పోటీచేస్తున్నారు. పసుపులేటి సుధాకర్ జనసేన వైపునుంచి దిగినా తెరవెనుక టీడీపీ మంత్రాంగం ఉందని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కావలి ఎమ్మెల్యేగా ప్రస్తుతం బలమైన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన్ను ఢీకొట్టి టీడీపీ గెలిచే పరిస్థితిలో లేదట.. అందుకే జనసేన నుంచి బలమైన అభ్యర్థిని దింపితే అంతిమంగా ఓట్లు చీలి టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని ఈ స్కెచ్ గీసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందులో ప్రధానంగా ఒకటే కిటుకు ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ సింగిల్ లో ఆంధ్రప్రదేశ్ లో పోటీచేస్తే ఎలాగూ అధికారంలోకి రాదన్నది ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.. కానీ అలా పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీడీపీకి లాభం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును జనసేన పంచుకుంటే వైసీపీ నష్టపోయి అంతిమంగా ఇది టీడీపీకి లాభం కలుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కావలిలో అప్లై చేసిన ప్లాన్ ను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అమలు చేయబోతున్నట్టు సమాచారం.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా బలమైన నేతలను లాగి జనసేన తరుఫున పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపికి పడకుండా చీలి జనసేన వైపు మరలుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలా ఓట్లు చీలితే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. ఇలా బలమైన నేతలు జనసేన వైపు వెళ్లేలా చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రాంగం ఏమైనా ఉందా అన్న అనుమానాలను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన వెనుకాల ఉండి ఈ తతంగమంతా చంద్రబాబే నడిపిస్తున్నాడా? అన్న అనుమానాలు లేకపోలేదంటున్నారు.

మరి పోల్ మేనేజ్ మెంట్ లో కింగ్ అయిన చంద్రబాబు అంత ఈజీగా అధికారాన్ని వదులుకునే సాహసం చేయలేడు. అందుకే తనకు ఉన్న అవకాశాలను అన్నీ బేరిజు వేసుకొని జనసేనలోకి బలమైన నేతలను పంపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైసీపీకి దక్కకుండా చేస్తున్నారనే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే మరోసారి వైసీపీకి అధికారం అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో జనసేనాని పావుగా మారాడా అన్న అనుమానాలు కూడా వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రాంగమో లేక లేక పవన్ కళ్యాన్ ప్లానో తెలియదు కానీ ఇప్పుడు టీడీపీ లో టికెట్ దక్కని నేతలు జనసేనలో చేరుతుండడంపై మాత్రం ఇదే అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ పుట్టిముంచే ఈ ఎత్తుగడపై ఏపీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.