Begin typing your search above and press return to search.

ప్రపంచం చూపంతా భారత్ వ్యాక్సిన్ పైనే..

By:  Tupaki Desk   |   20 Aug 2020 2:30 AM GMT
ప్రపంచం చూపంతా భారత్ వ్యాక్సిన్ పైనే..
X
ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు ఏరోజుకారోజు పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి నివారణకు తప్పనిసరిగా వ్యాక్సిన్ కావాల్సి ఉండటంతో అన్ని దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే పలు దేశాలు రెండో దఫా, మూడో దఫా క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకున్నాయి. రష్యా మాత్రం ఇప్పటికే తమదేశంలో వ్యాక్సిన్ సిద్ధమైపోయిందని, త్వరలోనే ప్రజలందరికీ అందజేస్తామని ప్రకటించింది. అయితే రష్యా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేయకుండానే టీకా విడుదల చేస్తోందని పరిశోధకులు ఆరోపిస్తున్నారు. అందుకే ఆ దేశం టీకా సిద్ధమైందని ప్రకటనలు ఇస్తున్నా మిగతా దేశాలు వ్యాక్సిన్ కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటా విడుదల చేయాలని కోరుతున్నాయి.

చైనా, అమెరికాలో కూడా వ్యాక్సిన్ తయారీ వేగంగా జరుగుతోంది. భారత్ లో హైదరాబాదులోని బయోటెక్ సంస్థ కరోనా నిరోధానికి వ్యాక్సిన్ సిద్ధం చేస్తోంది. మన దేశంలో సిద్ధమవుతున్న తొలి టీకా ఇదే. మన దేశానికి చెందిన జైడస్ క్యాడిలా డీఎన్ ఏ టైప్ వ్యాక్సిన్ సిద్ధం చేస్తోంది. ఇది రెండో దశలో ఉంది. డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్లు రెడీ చేస్తామని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ప్రకటించింది. చైనాకు చెందిన సైన్ వాక్ కంపెనీ బుటాన్ టాన్ వ్యాక్సిన్ సిద్ధం చేస్తుండగా.. ఇది మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయి మంచి ఫలితాలు సాధించింది. అమెరికా మోడర్నా కంపెనీ ఆర్ ఎన్ఏని బేస్ చేసుకుని టీకా తయారు చేస్తోంది. అక్కడ కూడా మూడో దశలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద త్వరలోనే తాము టీకా తీసుకువస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంతో ఇప్పుడు అన్ని దేశాల చూపు మనదేశంపై పడింది. ఇక్కడ టీకా సిద్ధమైతే కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయి.