Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: ‘నెల్లూరు సిటీ'లో గెలుపెవరిది?

By:  Tupaki Desk   |   29 March 2019 4:57 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: ‘నెల్లూరు సిటీలో గెలుపెవరిది?
X
అసెంబ్లీ నియోజకవర్గం : నెల్లూరు సిటీ
టీడీపీ: నారాయణ
వైసీపీ: పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌

దక్షిణాంధ్ర జిల్లాల్లోని నెల్లూరులో రాజకీయం వాడీవేడిగా సాగుతోంది. ముఖ్యంగా నెల్లూరు సిటీలో సార్వత్రిక పోరు రసవత్తరంగా మారింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఘన విజయం సాధించిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మరోసారి బరిలో ఉండగా.. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణ ఈ నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఓ వైపు అధికార పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అభివృద్ధి పనులు, మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ ఎమ్మెల్యే సొంత నిధులతో చేసిన అభివృద్ధి పనులు ప్రజల ముందు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారోనని నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

* నెల్లూరు సిటీ అసెంబ్లీ చరిత్ర
ఓటర్లు: లక్షా 70 వేలు, నెల్లూరు నగరం మొత్తం దీని పరిధిలో ఉంటుంది.

నియోజకవర్గ పునర్విభజన సందర్భంగా 2009లో నెల్లూరు పట్టణం పరిసర ప్రాంతాలను కలుపుకుని నెల్లూరు సిటీ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ తరువాత స్థానంలో ఎస్సీలు, బీసీలు ఉంటారు.

* ఆర్థిక అండదండలతో నారాయణ టీడీపీని గెలిపిస్తాడా..?
గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎన్నికై బాబు అండదండలతో మంత్రి పదవి చేపట్టిన నారాయణకు ఈసారి చంద్రబాబు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టికెట్‌ కేటాయించారు. రెండు నెలల కిందటే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని భావించి ఆయన నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేశారు. మరోవైపు ఇక్కడ 20 ఏళ్లుగా టీడీపీ జెండా ఎగరలేదు. దీంతో మంత్రి నారాయణ ఈసారి టీడీపీని గెలిపిస్తాడా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కంటే ఆర్థిక అండదండలు పుష్కలంగా ఉండడం నారాయణకు కలిసివస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తున్న శ్రీమంతుల్లో 400కోట్లకుపైగా ఆస్తులతో నారాయణ రెండో స్థానంలో ఉన్నారు. ఆ డబ్బు, అధికార పరపతితో గెలవడానికి నారాయణ ఇక్కడ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

* అనుకూలతలు:
- మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి
- సామాజికంగా, ఆర్థికంగా బలమున్న నేత
- కాపు, మైనార్టీ వర్గాల అండదండలు

* ప్రతికూలతలు:
- మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం
-కార్యకర్తలను పట్టించుకోకపోవడం
-ఆశించినమేర అభివృద్ధి చేయకపోవడం

* మరోసారి పాగా వేసేందుకు అనిల్‌ దూకుడు..
కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కు నెల్లూరు సిటీలో మంచి పట్టుంది. అందుకనే గత ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన ప్రజలకు అందుబాటులో లేడని పేరు వచ్చింది. ఎమ్మెల్యే అయిన తరువాత నియోజకవర్గ సమస్యలను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. కానీ వైసీపీ గాలి అనిల్ కు అండగా ఉంది. వైసీపీ నెల్లూరు జిల్లాలో పోయిన సారి మెజార్టీ సీట్లు దక్కించుకుంది. ఈసారి గాలీ బాగా వీస్తోంది. దీంతో తనను జగన్ మేనియానే గెలిపిస్తుందని అనిల్ దూకుడుగా ప్రచారంలో ముందుకెళ్తున్నారు. పైగా యువనేత కావడం.. మాస్ లీడర్ గా పేరుండడంతో ప్రజల్లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

* అనుకూలతలు:
- యువనేత అయినందున యువకుల ఫాలోయింగ్‌
- సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశారనే మంచి పేరు
- నియోజకవర్గంలో పార్టీని బలపర్చడం

* ప్రతికూలతలు:
-దూకుడు స్వభావంతో కార్యకర్తలు దూరం కావడం
-టీడీపీకి పెరుగుతున్న ఆదరణ

* కుబేరుడు, vs సామాన్యుడు.. గెలుపెవరిది?
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ గెలుపొందలేదు. దీంతో గత ప్రభుత్వంలో మంత్రి పనిచేసిన నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకవేళ టీడీపీ గెలిస్తే అటు నారాయణకు, ఇటు టీడీపీకి నియోజకవర్గంలో మొదటిసారి గెలిచినట్లవుతుంది. ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనిల్‌ యాదవ్‌ ఇప్పటికే తాను చేసిన అభివృద్ధి పనులతో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. అయితే నెల్లూరులో మాత్రం డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే ఎలాంటి చొరవ చూపడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా కుబేరుడికి, సామాన్యుడికి మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరు ఆసక్తి రేపుతోంది. అంతిమంగా నెల్లూరు సిటీ ప్రజలు ఎవరికి పట్టం కడుతారనేది ఆసక్తిగా మారింది.