Begin typing your search above and press return to search.

సీఎం వద్ద మంగళగిరి రిపోర్టులు.. ఎవరు గెలుస్తున్నారో తేల్చేశారు

By:  Tupaki Desk   |   11 May 2019 5:30 PM GMT
సీఎం వద్ద మంగళగిరి రిపోర్టులు.. ఎవరు గెలుస్తున్నారో తేల్చేశారు
X
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ విజయం సాధించబోతున్నారా..? దీనికి సంబంధించిన రిపోర్టులు ఇప్పటికే సీఎం వద్దకు చేరాయా..? ఈ విషయాన్ని టీడీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న లోకేష్.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇందుకోసం ఆయన చాలా రోజుల క్రితం తన ఓటు హక్కును అక్కడ నమోదు కూడా చేయించుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మంగళగిరి నుంచి లోకేష్ బరిలోకి దిగడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే పడింది. అందుకే ఇక్కడ ఎవరు గెలుస్తారనే ఉత్కంట సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.

మంగళగిరి నుంచి లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారనేదే ఈ వార్త సారాంశం. అన్ని జిల్లాల్లో ఓటింగ్ సరళిపై చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తన కుమారుడు స్థానం కావడంతో పాటు వైసీపీ కీలక నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తుండడం, రాజధానికి ముఖ ద్వారంగా చెప్పుకునే నియోజకవర్గం కావడంతో మంగళగిరిపై ఆయన ఇప్పటికే ప్రత్యేకంగా రివ్యూ చేశారని తెలిసింది. గతంలో నియమించిన బూత్ కన్వీనర్లు, పోలింగ్ ఏజెంట్లు, ఇతర టీడీపీ నాయకుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించిన టీడీపీ అధినేత ఈ ఎన్నికల్లో లోకేష్ ఘన విజయం సాధించబోతున్నారని తేల్చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. దీంతో ఈ వార్త నియోజకవర్గంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హల్‌ చల్ చేస్తోంది.

లోకేష్ విజయం సాధించబోతున్నారనడానికి కూడా చంద్రబాబు పలు కారణాలు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ఐదేళ్ల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం.. రాజధాని ప్రాంత రైతులకు చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం మేలు చేయడం.. పసుపు- కుంకుమ, పింఛన్ల రెట్టింపు, నిరుద్యోగ భృతి సహా పలు పథకాలు తీసుకు రావడం వంటి వాటి వల్ల ప్రజలు లోకేష్ వైపే మొగ్గు చూపారని చంద్రబాబు క్లారిటీకి వచ్చేశారట. వాస్తవానికి గత ఎన్నికల్లోనే మంగళగిరిలో టీడీపీ గెలవాల్సింది. ఆ ఎన్నికల్లో టీడీపి తరపున పోటీ చేసిన గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై 12 ఓట్ల అతిస్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక, ఈ నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ తరపున షేక్‌ సలీం బరిలో నిలిచారు.