పార్లమెంట్ నియోజకవర్గం : గుంటూరు
టీడీపీ : గల్లా జయదేవ్ (సిట్టింగ్ ఎంపీ)
వైసీపీ : మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
ఏపీ రాజధాని రాజధాని అమరావతి గుంటూరు జిల్లా పరిధిలో ఉంది. దీంతో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో సార్వత్రిక పోరు ఢీ అంటే ఢీ అన్నట్లు సాగుతోంది. ఆర్థికంగా బలమున్న వారి మధ్య సాగుతున్న ఈ ఎన్నికల పోరులో ఎవరు నెగ్గుతారనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఎందుకుంటే మొన్నటి వరకు టీడీపీలో కొనసాగిన మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆ పార్టీని వీడి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ కే పార్టీ అధిష్టానం మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించింది. దీంతో ఇద్దరు బలమైన నేతల మధ్య పోరు ఆసక్తిరేపుతోంది.
* పార్లమెంట్ నియోజకవర్గం గుంటూరు చరిత్ర:
ఓటర్లు: 15 లక్షలు
అసెంబ్లీ నియోజకవర్గాలు: గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, మంగళగిరి, తెనాలి, పత్తిపాడు, పొన్నూరు.
గుంటూరులో పోయిన సారి టీడీపీ హవా నడిచింది. ఆది నుంచి గుంటూరు ప్రాంతం టీడీపీకి కంచుకోటగా నిలుస్తోంది. ఎన్టీఆర్ హయాం నుంచే ఇక్కడ టీడీపీ నేతల హవా కొనసాగింది. పోయిన సారి టీడీపీ-బీజేపీ కలిసి ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచాయి. 2014లో గుంటూరు ఎంపీగా టీడీపీ తరుఫున పోటీచేసిన గల్లా జయదేవ్ విజయం సాధించారు. వైసీపీ నుంచి నిలబడ్డ వల్లభనేని బాలాశౌరిపై 67వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. ఈసారి గల్లా జయదేవ్ టీడీపీ నుంచి మరోసారి నిలబడగా.. వైసీపీ నుంచి మోదుగుల బరిలో ఉన్నారు.
* గల్లా జయదేవ్ కు టఫ్ ఫైట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గల్లాజయదేవ్ 2014 ఎన్నికల్లో రాజకీయారంగేట్రం చేశారు. రాగానే టీడీపీ నుంచి టికెట్ పొంది ఎంపీగా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు ఎంపీగా ఎన్నికై ప్రత్యేకతను సాధించుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో గల్లా కొంతవరకు శ్రద్ధ చూపారు. ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల రూపాయల కేంద్ర నిధులను విడుదల చేయడంలో కృషి చేశారు. అయితే ఆయన స్థానికంగా ఉండరనే అపవాదు ఎక్కువగా ఉంది. తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఎంపీ ఎప్పుడూ దొరకడని కొందరు విమర్శిస్తున్నారు. స్థానికేతరుడు కావడం ఇక్కడ ఈయనకు మైనస్ గా మారింది.
* అనుకూలతలు:
-కేంద్ర నిధులు విడుదల చేయడంలో కృషి
-రాజధాని జిల్లాకు ఎంపీగా పోటీ చేయడం
-ఆర్థికంగా బలంగా ఉండడం
-ప్రత్యేక హోదా నినాదాన్ని పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా వినిపించడం
* ప్రతికూలతలు:
-స్థానికంగా ఉండకపోవడం
-రాజధాని జిల్లాకు ఎంపీగా ఉన్న స్థానికులను పట్టించుకోకపోవడం.. ప్రజల్లో కలువకపోవడం..
* బలంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి:
ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున గత ఎన్నికల్లో మోదుగుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని భావించిన ఆయన ఇటీవల వైసీపీలోకి చేరారు. ముందుగానే గుంటూరు ఎంపీ టికెట్ హామీతో ఫ్యాన్ పార్టీలో చేరిన మోదుగులకు అనుకున్నట్లుగానే జగన్ ఎంపీ టికెట్‌ను కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తన సత్తా చూపిస్తానని అంటున్నారు. ఇప్పటి వరకు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ మాటలకే పరిమితమయ్యారని, చేసే పనులు ఒక్కటీ లేవని బలంగా ప్రజల ముందుకు వెళుతున్నారు..
* అనుకూలతలు:
-ఇప్పటివరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులు
-గతంలో ఎంపీగా చేసిన అనుభవం
-ఆర్థికంగా బలంతో పాటు ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు స్కెచ్ లు వేయడం
-మోదుగులకు జిల్లావ్యాప్తంగా అభిమానులు.. స్థానికుడన్న బలం కలిసి వస్తుంది.
* ప్రతికూలతలు:
-గుంటూరులోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ హవా ఉండడం
-పార్టీ కేడర్ తక్కువగా ఉండడం
* టఫ్ ఫైట్ లో మోదుగులకే కాస్త మొగ్గు..
గల్లా జయదేవ్ నాన్ లోకల్ ఎంపీ అనే ముద్ర పడింది. దీనిపై ప్రచారం చేస్తున్న మోదుగుల వేణుగోపాలరెడ్డి తాను విదేశాల్లో పర్యటించనని, ఎప్పుడూ ప్రజలతోనే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ప్రచారం చేస్తున్నారు. దీంతో టీడీపీకి కొంత ప్రతికూలం ఏర్పడే అవకాశాలున్నాయి. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కార్యకర్తలు టీడీపీని వీడి వైసీపీలో చేరుతుండడం మోదుగులకు కలిసివచ్చే అవకాశాలున్నాయి. కాపు, బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వీరు మద్దతు మోదుగులకే కనిపిస్తోంది. కమ్మ ఓటు గల్లా జయదేవ్ కే పడనుండగా.. మిగతా కులాల ఓట్లు మోదుగులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా మోదుగులకు కలిసి వస్తోంది. ఇలా టఫ్ ఫైట్ లో గల్లాపై మోదుగలకే కాస్తా ఎడ్జ్ కనిపిస్తోంది.