Begin typing your search above and press return to search.

మోపిదేవి ప్లేసులో ఎవరో?.. ఎమ్మెల్సీ ఎన్నికకు ఈసీ షెడ్యూల్

By:  Tupaki Desk   |   30 July 2020 3:00 PM GMT
మోపిదేవి ప్లేసులో ఎవరో?.. ఎమ్మెల్సీ ఎన్నికకు ఈసీ షెడ్యూల్
X
రాజకీయ పరంగా ఎప్పటికప్పుడు హీట్ పెరిగిపోతున్న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో మరింత వేడి రాజుకోనుందనే చెప్పాలి. ఏపీ శాసనమండలిలో సభ్యులుగా ఉన్న మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన సీటును భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. పిల్లి సుభాష్ ఖాళీ చేసిన ఎమ్మెల్సీ సీటు కాలపరిమితి ఆరు నెలలు మాత్రమే ఉండటంతో ఆ సీటుకు ఇప్పుడు ఎన్నికలు జరగడం లేదు. మొత్తంగా రెండు సీట్లు ఖాళీ అయితే కేవలం ఒక సీటుకు మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయన్న మాట.

ఈ సీటుకు వెలువడిన ఈసీ షెడ్యూల్ ప్రకారం... వచ్చే నెల 6న ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ ముగియనుండగా, ఆగస్టు 24న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ కూడా పూర్తి కానుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో పోలింగ్ అనివార్యమైన పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పక్కాగా పాటిస్తూ పోలింగ్ ను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవలే గవర్నర్ కోటాలో రెండు సీట్లు ఖాళీగా కాగా... వాటిని భర్తీ చేసిన వైసీపీ... మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుతో పాటు కడప జిల్లాకు చెందిన మయానా జకియా ఖానామ్ లను మండలికి పంపింది. అయితే చాలా కాలం నుంచి ఎమ్మెల్సీ పదవుల కోసం వేచి చూస్తున్న వారు వైసీపీలో చాలా మందే ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ తో పాటు పలువురు కీలక నేతలు కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు భర్తీ కానున్న స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఇక టీడీపీకి ఈ సీటుపై ఎలాంటి ఆశలు లేని నేపథ్యంలో పార్టీలో అంతగా సందడి లేదనే చెప్పాలి.