Begin typing your search above and press return to search.

క్రాస్‌ ఓటింగ్‌ టెన్షన్.. ఎవరిని ముంచేస్తుంది?

By:  Tupaki Desk   |   13 April 2019 8:51 AM GMT
క్రాస్‌ ఓటింగ్‌ టెన్షన్.. ఎవరిని ముంచేస్తుంది?
X
ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాధారణంగా పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిగితే క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంటుంది. మొన్నటి ఏపీ ఎన్నికల్లోనూ అదే సీన్‌ రిపీట్‌ అయినట్లు పార్టీల నేతలు భావిస్తున్నారు. సగటు ఓటరు అసెంబ్లీకి తాను ఎంచుకున్న పార్టీకే వేస్తాడు. కానీ పార్లమెంట్‌ కొచ్చేసరికి పెద్దగా నిర్ణయం ఉండదు. ఏదో ఒక పార్టీ అంటూ నిట్టూర్చుతారు. మరోవైపు అభ్యర్థులు సైతం ప్రలోభాల విషయంలో పార్లమెంట్‌ స్థాయిలో పట్టించుకోరు. అందుకే ఓటర్లు ఇక్కడే ప్రాంతీయ పార్టీలను పట్టించుకోకుండా ప్రభావితం కాకుండా జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కానీ జాతీయ పార్టీలు ఏపీలో ప్రభావం చూపలేదు. మరి ఏపీ ఓటర్లు పార్లమెంట్‌ స్థాయిలో ఏ పార్టీకి వేశారోనన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలో 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ బోటాబోటీగా 150కి పైగా సీట్లు గెలుచుకుంది. కానీ పార్లమెంట్‌ లో 34 సీట్లను గెలుచుకుంది. ఆ సమయంలో అసెంబ్లీ స్థానంలో వచ్చిన పీఆర్పీ భారీగా ఓట్లు చీల్చింది. కానీ జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ బలంగా ఉండడంతో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి.

ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉంది. బీజేపీ అధికారంలో ఉన్నా ఏపీలో సరైన అభ్యర్థులు లేకపోవడంతో ప్రచారం చేయలేకపోయారు. దీంతో పార్లమెంట్‌ ఓట్లన్నీ టీడీపీ, వైసీపీల మధ్యే పోలైనట్లు తెలుస్తోంది. అయితే ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయోనన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. ఎన్నికల ప్రారంభం నుంచి తమకంటే తమకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని ఆయా పార్టీల అధినేతలు ప్రచారం చేశారు. ఆ స్థాయిలో అభ్యర్థులను కూడా పోటాపోటీగా బరిలోకి దించారు.

కానీ అసెంబ్లీ అభ్యర్థులు చేసిన ప్రచారం, చేపట్టిన ప్రలోభాల కార్యక్రమం పార్లమెంట్‌ బరిలో ఉన్నవారు చేయలేదన్న చర్చ సాగుతోంది. దీంతో ఓటర్లు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను కాకుండా గుర్తును చూసే ఓటేశారని తెలుస్తోంది. ఫలితాలకు ఇంకా సమయం ఎక్కువగా ఉండనుండడంతో ఆయా పార్టీల అధినేతలు ఇలా పార్లమెంట్‌ ఓట్లు ఎక్కడెక్కడా క్రాస్‌ అయ్యాయోనని లెక్కలేసుకుంటున్నారట.