Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ పీఠం ఎవరి సొంతం కాబోతుందంటే ?

By:  Tupaki Desk   |   18 Dec 2019 1:30 AM GMT
తెలంగాణ బీజేపీ పీఠం ఎవరి సొంతం కాబోతుందంటే ?
X
భారతీయ జనతా పార్టీ ..వరుసగా కేంద్రంలో రెండోసారి కూడా సంపూర్ణ మెజారిటీ తో అధికారాన్ని కైవసం చేసుకుంది. అలాగే దేశంలో సగానికిపై రాష్ట్రాలలో బీజేపీ తమ ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలోపు తెలంగాణ లో అధికారం దక్కించుకోవాలనే దృఢ సంకల్పంతో ..పార్టీ అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ లో టి ఆర్ ఎస్ కి మేమే ప్రధాన పోటీదారులం అని మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల తరువాత దేశం ప్రధాని మోడీ ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఒకరి తరువాత ఒకరు పర్యటిస్తుండటం తో తెలంగాణ పై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించి ..వ్యూహాలని పక్కాగా అమలు చేయబోతున్నారు అన్న నేపథ్యంలో పదవి కోసం ఆశ పెట్టుకొని ఉన్నవారు ..ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ నెల ఆఖరికి ఈ ప్రక్రియ పూర్తి చేయబోతుంది అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే ఈ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పోటీలో చాలామంది ఉన్నారు. మరోసారి తనను అధ్యక్షుడిగా కొనసాగించాలని లక్ష్మణ్ బలంగా కోరుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లక్ష్మణ్ పని తీరుపై సంతృప్తిగా ఉండటం తో అయన కూడా రేసులో ఉన్నాడు. ఇక మరోవైపు నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించి, జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. ఈయన ప్రధాని మోడీ , అమిత్ షా లనే నమ్ముకొని ఉన్నారు.

ఇక కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచి, ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌గా పాపులర్ అవుతున్న బండి సంజయ్ సైతం, అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు సీనియర్ల ద్వారా, ఆయన పావులు కదుపుతున్నట్ట తెలుస్తుంది. అలాగే మరోవైపు మాజీ మంత్రి డీకే అరుణ పేరు కూడా బీజేపీ ప్రెసిడెంట్‌ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకి రెడ్డి సామజిక వర్గం మొత్తం మద్దతు తెలుపుతుంది. అలాగే తాజాగా మద్యనిషేధాన్ని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల దీక్షకు దిగగా ..మొత్తం తెలంగాణ బీజేపీలోని సీనియర్లు ఆమెకి సపోర్ట్ గా నిలిచారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపులకు తప్ప రాష్ట్ర స్థాయిలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా రాని స్పందన డి.కె.అరుణ దీక్షకు రావడంతో పార్టీ వర్గాలు ఆమె పేరుని చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే పార్టీలో ఎప్పటినుండో కొనసాగుతున్న సీనియర్లని కాదు అని ..కొత్తగా పార్టీలో చేరిన అరుణ కి అధ్యక్ష పదవి కట్టబెడితే ఎదురయ్యే ఇబ్బందుల పై కూడా చర్చ నడుస్తుంది అని సమాచారం. డిసెంబర్ నెలాఖరు నాటికి టి.బిజెపికి కొత్త అధ్యక్షుని ఎంపిక పూర్తి చేయాలని బిజెపి అధినాయకత్వం భావిస్తున్న తరుణం లో వీరిలో ఎవరికీ అధ్యక్షడిగా అవకాశం దక్కుతుందో చూడాలి.