Begin typing your search above and press return to search.

బెన్ వారసుల లిస్ట్ లో ఆ నలుగురు

By:  Tupaki Desk   |   2 Aug 2016 5:26 AM GMT
బెన్ వారసుల లిస్ట్ లో ఆ నలుగురు
X
విజయం వయసును కవర్ చేస్తుంది. అదే సమయంలో ఓటమి లేని వయసును నెత్తి మీదకు తీసుకొస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆనందీబెన్ వ్యవహారం కూడా ఇలానే ఉంది. మోడీ వారసురాలిగా గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనందీ బెన్.. పగ్గాల్ని ఒడుపుగా పట్టుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కోవటం.. మరో ఏడాదిలో రానున్నగుజరాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నడిపించే విషయంలో తలెత్తుతున్న సందేహాల నేపథ్యంలో.. కఠిన చర్యలకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. అధినాయకత్వం సూచనలకు తగ్గట్లే తన పదవికి రాజీనామా చేసి లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపి తన బాధ్యతను పూర్తి చేశారు.

అనూహ్యంగా తెర మీదకు వచ్చిన ఆనందీ రాజీనామా నేపథ్యంలో.. ఆమె వారసుడిగా ఎవరు సీఎం పదవిని చేపడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుజరాత్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పటేళ్ల ఉద్యమాన్ని సమర్థంగా కంట్రోల్ చేయటంతో పాటు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడ్ని పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో నలుగురు నేతలు నిలుస్తున్నారు. వీరిలో ఒకరు సీఎం కావటం ఖాయమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న సంగతి చూస్తే..

1. నితిన్ భాయ్ పటేల్

పటేల్ వర్గానికి చెందిన ఈ నేత వరుసలో ముందున్నారు. ఆయనకుకానీ పగ్గాలు అప్పగిస్తే.. పటేళ్ల ఇష్యూను ఒక కొలిక్కి తెస్తారని చెబుతున్నా.. ఇతగాడంటే చాలా కులాలకు పడకపోవటం మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు.సంఘ్ పరివార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆయన్ను కానీ ఎంపిక చేస్తే లాభనష్టాలు సరిసమానంగా ఉంటాయంటున్నారు.

2. సౌరభ్ పటేల్

గుజరాత్ రాస్ట్ర ఆర్థిక మంత్రిగా.. విద్యుత్ శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న ఈయన పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రధని మోడీకి సన్నిహితుడిగా.. అత్యంత విధేయుడిగా ఉన్న ఆయనకు మంచి నేత అన్న ట్యాగ్ ఉంది. విద్యుత్ రంగం గుజరాత్ లో వెలిగిపోయేలా చేయటంలో ఈ నేత పాత్ర చాలా కీలకం. గుజరాత్ అభివృద్ధి మంత్రానికి ఈ నేత సరిగ్గా సరిపోతారన్న అంచనా ఉంది.

3. భూపేంద్ర సింగ్ చుడా

గుజరాత్ సీఎం స్థానానికి పోటీ పడుతున్న నేతల్లో చుడా ఒకరు. సీఎం పదవికి పోటీ పడుతున్న నేతల్లో వయసులో చూస్తే ఈయనే పెద్ద. సంఘ్ పరివార్ అండదండలతో పాటు.. బీజేపీలోని రాజపుత్ర వర్గానికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తుంటారు. దళితుల సమస్యల పట్ల కమిట్ మెంట్ తో పని చేసే నేతగా ఇమేజ్ ఉన్న ఆయన.. అందరిని కలుపుకుపోయే సామర్థ్యం తక్కువగా చెబుతారు. పాలన విషయంలో ఇబ్బంది లేకపోయినా.. పార్టీ నడపటంలో ఈ పెద్ద మనిషితో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతోంది.

4. విజయ్ రూపణి

గుజరాత్ క్యాబినెట్ లో మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ నేత రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కూడా. ప్రధాని మోడీకి.. పార్టీ చీఫ్ అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అవసరమైన మరో అర్హత కూడా ఉంది. అదే.. సంఘ్ పరివార్ కు అనుకూలుడన్న పేరు. మంచి రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ఆయనకు ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏమిటంటే.. వయసులో అందరి కంటో చిన్నోడు. పార్టీని నడిపించే సామర్థ్యం ఉన్నా.. గుజరాత్ ముఖ్యమంత్రి పొజిషన్ సమర్థంగా టాకిల్ చేస్తారా? అన్నదే అతనిపై ఉన్న ఏకైక డౌట్ గా చెబుతారు.