Begin typing your search above and press return to search.

న‌లుగురిలో గుజ‌రాత్ కుర్చీ ద‌క్కేదెవ‌రికి?

By:  Tupaki Desk   |   20 Dec 2017 6:49 AM GMT
న‌లుగురిలో గుజ‌రాత్ కుర్చీ ద‌క్కేదెవ‌రికి?
X
ఇట్టే ఆక‌ట్టుకునే అంశాలు.. సంచ‌ల‌నంగా తెర మీద‌కు వ‌స్తే విష‌యాలు ఎక్కువ కాలం వార్త‌ల్లో నిల‌వ‌వు. అదే రీతిలో అత్యున్న‌త స్థానాలకు సంబంధించిన రేసులో తెర మీద‌కు వ‌చ్చే వారి పేర్లు చాలా త్వ‌ర‌గా తెర మ‌రుగు అవుతుంటాయి. తాజాగా అలాంటి ప‌రిస్థితే గుజ‌రాత్‌ లో చోటు చేసుకుంది. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి రేసులో స్మృతి ఇరానీ ఉన్న‌ట్లుగా కొన్ని మీడియా సంస్థ‌లు వార్త‌లు రాశాయి.

ఏ యాంగిల్‌ లో చేసినా ఆమెకు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి అయ్యే అర్హ‌త క‌నిపించ‌దు. అయిన‌ప్ప‌టికీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి కాస్త చ‌ర్చ జ‌రిగింది. ఇదిలా ఉంటే.. గుజ‌రాత్ సీఎం కుర్చీలో పోటీకి న‌లుగురు ప్ర‌ముఖుల పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఆరోసారి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బీజేపీ.. ఇప్పుడిప్పుడు ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటోంది. త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బొటాబొటి సీట్ల‌తో విజ‌యంతో ఊపిరి పీల్చుకున్న మోడీ అండ్ కో ఇప్పుడు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాలని భావిస్తోంది.

22 ఏళ్లుగా నాన్ స్టాప్ అధికారం అందించిన గుజ‌రాతీయులు తాజాగా మ‌రో ఐదేళ్ల‌కు పాల‌నా ప‌గ్గాల్ని బీజేపీ నేత‌ల‌కు ఇవ్వ‌టంతో.. ఈసారి గ‌తంలో జ‌రిగిన త‌ప్పులు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. గుజ‌రాత్ గెలుపు మీద బీజేపీ నేత‌లు బాహాటంగా చొక్కాలు చింపేసుకొని సంబ‌రాలు చేసుకున్న‌ప్ప‌టికీ అత్తెస‌రు మార్కుల‌తో గెలిచిన విష‌యాన్ని పార్టీ అధినాయ‌క‌త్వం ప‌రిశీలిస్తోంది.

ఇక‌.. ఎన్నిక‌ల వేళ ముఖ్య‌మంత్రిగా ఉన్న విజ‌య్ రూపానీ గ‌త ఏడాది ఆగ‌స్టు నుంచి సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఎన్నిక‌ల వేళ ఆయ‌న ప‌నితీరు అంత తృప్తిక‌రంగా లేద‌న్న మాట వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో కొత్త‌వారికి ప‌గ్గాలు ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో పార్టీలో ఆలోచిస్తోంది. తాజాగా గుజ‌రాత్ సీఎం రేసులో సీఎంగా ఉన్న విజ‌య్ రూపానీ త‌న‌ను కొన‌సాగించాల‌ని కోరుతున్నారు. ఓవైపు అద్భుత‌మైన విజ‌యంగా బీజేపీ నేత‌లు అభివ‌ర్ణిస్తున్న వేళ‌.. ఇప్పుడున్న సీఎంను మార్చ‌డ‌మంటే.. త‌ప్పుడు సంకేతాలు వెళ్లే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఫ‌లితాలు వెలువ‌డిన నేప‌థ్యంలో.. మార్పు దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌న్న భావ‌న గుజ‌రాతీయుల మ‌న‌సుల్లో ముద్ర ప‌డేలా చేయాలంటే కొత్త నాయ‌క‌త్వానికి ప‌గ్గాలు అప్ప‌గిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. ఇదిలా ఉంటే.. సీఎం కుర్చీ కోసం కేంద్ర స‌హాయ‌మంత్రి మ‌న్సుఖ్ లాల్ మాండ‌వీయ పేరు వినిపిస్తోంది.

వీరితో పాటు.. ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న నితిన్ ప‌టేల్ సైతం త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్లుగా చెబుతున్నారు. వారిద్ద‌రు కాకుండా ప్ర‌స్తుతం కర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న వ‌జుభాయ్ వాలా పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటు జైరామ్ ఠాకూర్ పేరును కూడా ప‌రిశీలన‌లోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

మ‌రో ఏడాదిన్న‌ర వ్య‌వ‌ధిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఇప్పుడు ఏవైతే అసెంబ్లీ స్థానాలు కోల్పోయారో వాట‌న్నింటిలోనూ పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మొహ‌మాటాల‌కు పోకుండా స‌మ‌ర్థ‌త‌కు పెద్ద‌పీట వేస్తూ నిర్ణ‌యం తీసుకుంటార‌న్న ఆశ ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. మోడీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.