Begin typing your search above and press return to search.

ఏ 'రెడ్డి' లేడీ మేయర్ కుర్చీలో కూర్చోనుంది?

By:  Tupaki Desk   |   5 Dec 2020 6:52 AM GMT
ఏ రెడ్డి లేడీ మేయర్ కుర్చీలో కూర్చోనుంది?
X
గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. హంగ్ అనివార్యమైంది. అత్యధిక సీట్లు సాధించిన టీఆర్ఎస్ పార్టీ పొత్తుల సంసారంలో ఎంఐఎంతో కలిసి గ్రేటర్ మేయర్ పీఠం చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్త మేయర్‌ను వెతుక్కోవాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ తరువాత కొత్త మేయర్ కావాలని టీఆర్ఎస్ లో తీవ్ర పోటీ నెలకొంది. తొమ్మిది మంది టిఆర్ఎస్ మహిళా అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ఆరుగురు ఆయా వార్డుల నుంచి గెలిచారు. మిగిలిన ముగ్గురు ఓడిపోవడంతో నిష్క్రమించారు.

భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్ష్ రెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయ శాంతి, ఖైరతాబాద్ నుండి విజయ రెడ్డి, బంజారా హిల్స్ నుండి విజయ లక్ష్మి, వెంకటేశ్వర కాలనీకి చెందిన మన్నే కవితా రెడ్డి, తార్నాకా నుండి మోథే శ్రీ లతా రెడ్డిల పేర్లు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మేయర్ రేసులో వినిపిస్తోంది.

టీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుబాష్ రెడ్డి భార్య బి స్వప్నా రెడ్డి హబ్సిగుడాలో ఓడిపోగా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల సునరితా రెడ్డి తన మూసరంబాగ్ సీటులో గెలవలేకపోయారు.. బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్, టిఆర్ఎస్ అభ్యర్థి ఎం లక్ష్మీప్రసన్న గౌడ్ కూడా ఓడిపోయారు. దీంతో మేయర్ రేసులో ముందున్న వీరు ముగ్గురు వైదొలిగారు.

మేయర్ రేసులో ఇప్పుడు ప్రజాదరణ పరంగా ముందుకున్నారు భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్ష్ రెడ్డి. తన వార్డులోని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సింధు బాగా పనిచేసి రెండోసారి గెలిచాడని టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తెలిపారు.

దివంగత కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి కుమార్తె విజయ రెడ్డి మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఆమె తన తండ్రి పాపులారిటీతో ఈ సీటును చేజిక్కించుకోవాలని ఆశపడుతోంది. ప్రజలలో పిజెఆర్ కు అభిమానం ఉండడం.. ఆమె వార్డులోని ప్రజలతో సఖ్యతతో ఉండడంతో వరుసగా గెలుస్తోంది.

మల్కాజగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనక రెడ్డి మరణం తరువాత, అతని కుటుంబ సభ్యులు టికెట్ ఆశించారు. అయితే, టిఆర్ఎస్ నాయకత్వం 2018 లో మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇచ్చింది. "ఇప్పుడు, కనకరెడ్డి కోడలు విజయ శాంతి మేయర్ కావడానికి అవకాశం ఉంది" అని ఒక పార్టీ నాయకుడు చెప్పారు.

తార్నాకా నుంచి గెలిచిన శ్రీ లతా టిఆర్‌ఎస్‌కు విధేయతగా ఉంటున్నందున ఆమెకు అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సీనియర్ నాయకుడు కె. కేశవ రావు కుమార్తె కవిత, విజయ రెడ్డి కూడా మేయర్ రేసులో ఉన్నారు. వీరందరిలో కేసీఆర్ ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది.