Begin typing your search above and press return to search.

‘మహా’ సీఎం జూనియర్ ఠాక్రే?... కార్యరంగం సిద్ధమవుతోంది

By:  Tupaki Desk   |   4 Nov 2019 2:59 PM GMT
‘మహా’ సీఎం జూనియర్ ఠాక్రే?... కార్యరంగం సిద్ధమవుతోంది
X
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అసలు మొన్నటి మాదిరిగా బీజేపీ, శివసేనల మధ్య పొత్తు పొడుస్తుందా? చెరి సగం అధికారం ఆ రెండు పార్టీలు పంచుకుంటాయా? అలాగైతే.. తొలుత సీఎం అయ్యేది ఎవరు? బీజేపీకి చెందిన మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ దా? లేదంటే... ఈ సారి సీఎం కుర్చీపై కూర్చునేస్తానంటూ సంచలన ప్రకటన చేస్తున్న శివసేన కుర్ర నేత ఆదిత్య ఠాక్రేదా? పొత్తుకు లెక్కలేనన్ని కండీషన్లు పెట్టేస్తున్న బీజేపీని పక్కనపెట్టేసి ఆదిత్య ఏకంగా ఐదేళ్ల పాటు సీఎంగా ప్రమాణం చేస్తారా? ఎహే... నాలుగో వంతు సీట్లు కూడా దక్కించుకోని శివసేనతో పొత్తేమిటీ? అంటూ బీజేపీ తనదైన శైలి వ్యూహాలు రచించి... ఠాక్రేకు జెల్ల కొట్టేస్తుందా? ఈ ఇద్దరూ కాకుండా మూడో వ్యక్తి రంగంలోకి దిగేసి... ఏకంగా ఐదేళ్ల పాటు మహారాష్ట్రను పాలించేస్తారా?... ఇలా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే పార్టీ, సీఎం కుర్చీపై కూర్చునే నేతలకు సంబంధించి లెక్కలపై లెక్కలేనన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో జాతీయ మీడియాకు చెందిన ఓ ఆంగ్ల పత్రిక తనదైన శైలి సంచలన కథనాన్ని ప్రచురించింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేది శివసేన ఆధ్వర్యంలోనేనని, ఆదిత్య ఠాక్రే కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని కూడా సంచలన కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా ఆదిత్య ఠాక్రే... ముంబైలోని శివాజీ పార్క్ లో మహారాష్ట్ర కొత్త సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారని కూడా ఆ పత్రిక తెలిపింది. ఇప్పటికే బీజేపీ, శివసేనల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు అంతకంతకూ మృగ్యమవుతున్నాయి. మొన్నటిదాకా కలిసే సాగిన ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు కొత్తగా రాజీ ఫార్మ్యూలాకు సంబంధించి పొరపొచ్చాలు వచ్చాయి. ఐదేళ్లలో చెరి రెండున్నరేళ్ల పాటు సీఎం కుర్చీని పంచుకుందామంటూ శివసేన చేసిన ప్రతిపాదనకు బీజేపీ ససేమిరా అంటోంది. ఇదివరకటిలా ఇప్పుడు కూడా తమకు మిత్రపక్షంగానే కొనసాగాలని, సీఎం కుర్చీపై ఆశలు వదులుకోవాలంటూ బీజేపీ చెబుతున్న మాటలు శివసేనకు ఏమాత్రం రుచించడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో మొన్నటిదాకా విపక్షానికే పరిమితం అవుతామని ప్రకటించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పుడు కొత్త సమీకరణాలకు సంబంధించిన వ్యూహ రచనలో మునిగిపోయారు. విపక్షంలో కూర్చుంటామన్న మాటను వదిలేసిన పవార్... శివసేనకు అధికార పీఠంలో కూర్చోబెట్టి... ఆ పార్టీకి బయట నుంచో, లేదంటే కేబినెట్ లో చేరో మిత్రపక్షంగా కొనసాగేందుకు దాదాపుగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగానే కనిపిస్తున్నారు. శివసేన, ఎన్సీపీ కలిసినా... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి మెజారిటీ రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కూడా జట్టు కట్టాలన్న దిశగా పవార్ పావులు కదుపుతున్నారని సదరు ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇందులో భాగంగా ఆయన తన ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్నారని, ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారని... శివసేనకు మద్దతు పలికే విషయంలోనే ఆమెతో చర్చలు జరపనున్నారని కూడా ఆ కథనం పేర్కొంది. మొత్తంగా శివసేన కుర్ర నేత ఆదిత్య ఠాక్రేను సీఎం కుర్చీలో కూర్చోబెట్టే వ్యూహాలకు పవార్ తనదైన శైలి వ్యూహాలు రచిస్తున్నారని చెప్పిన ఆ పత్రిక కథనం ఆసక్తి రేకెత్తిస్తోంది.