Begin typing your search above and press return to search.

పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటే ఏంటి ?

By:  Tupaki Desk   |   19 Sep 2021 10:36 AM GMT
పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటే ఏంటి ?
X
రాబోయే దీపావళి పండుగ తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడు రాబోతున్నారు. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదని అధిష్టానం భావిస్తోంది. ఈ విషయాన్ని సీడబ్లూసీ సభ్యుడు, కేంద్రమాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ స్వయంగా మీడియాతో చెప్పారు. అంటే శైలజానాద్ పని తీరు బావోలేదని ఆయన చెప్పలేదు కానీ దీపావళి తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించబోతున్నట్లు మాత్రం చెప్పారు.

పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారంటే ఇపుడున్న అధ్యక్షుడి పనితీరు విషయంలో అధిష్టానం పెద్దగా సాటిసిఫై కావటం లేదనే కదా అర్థం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు అధ్యక్షుడిగా ఉన్న ఒరిగేదేమీ లేదు. మెజారిటీ జనాల మనోభీష్టానికి వ్యతిరేకంగా సోనియా గాంధీ అప్పటి సమైక్య రాష్ట్రాన్ని రెండుగా చీల్చారు. ప్రత్యేక తెలంగాణా కావాలని 10 జిల్లాల్లోని కొందరు మాత్రమే డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో రాష్ట్రాన్ని చీల్చవద్దని 13 జిల్లాల జనాలు ముక్తకంఠంతో మొత్తుకున్నారు. సరే ఏవో అంచనాలు, లెక్కలు వేసుకుని సోనియా రాష్ట్ర విభజనకు డిసైడ్ చేశారు. సోనియా చేసిన మొదటి తప్పు ఏమిటంటే మెజారిటి జనాల మనోభావాలను ఏ మాత్రం పట్టించుకోకపోవటం. రెండో తప్పు ఏమిటంటే చేసిన విభజన కూడా అడ్డుగోలుగా చేయడం. ప్లస్సులన్నీ తెలంగాణాకు ఇచ్చేసి మైనస్సులన్నీ ఏపీ ఖాతాలో వేశారు. రాజధాని, ఆదాయ వనరులు, మిగులు నిధులు, ఆదాయ మార్గాలన్నింటినీ తెలంగాణాకు ఇచ్చేశారు.

సోనియా చేసిన అడ్డుగోలు విభజన కారణంగా ఏపీ వట్టిపోయిన ఆవులాగా తయారైంది. దీంతో జనాలకు బాగా మండిపోయింది. అందుకనే పెద్ద గొయ్యి తవ్వి కాంగ్రెస్ ను కప్పెట్టేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోగా అభ్యర్థులు ఎక్కడా డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. 2019లో కూడా సేమ్ సీన్ రిపీటైంది. అంటే జనాల్లో కాంగ్రెస్ అంటే ఏ స్థాయిలో మంట ఉందో అర్ధమవుతోంది.

జనాల్లోని ఈ మంట కనీసం మరో రెండు ఎన్నికల వరకు ఇలాగే ఉంటుందని అర్ధమవుతోంది. సాధారణ ఎన్నికలే కాదు కనీసం స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా ఎక్కడా ఒక్కసీటు కూడా దక్కకుండా చేశారు. మరిలాంటి పార్టీకి అధ్యక్షుడిగా ఎవరుంటే ఏమిటి ? అనేదే ప్రశ్న. విభజన తర్వాత మొదటి అధ్యక్షునిగా రఘువీరారెడ్డి యాదవ్ పనిచేశారు. ఇపుడు శైలజానాద్ ఉన్నారు. పార్టీలో ఏమాత్రం మార్పు కనబడలేదు. రేపు మరో అధ్యక్షుడు వచ్చినా సేమ్ టు సేమ్ కంటిన్యు అవుతుందంతే.