Begin typing your search above and press return to search.

విపక్ష నేతగా బాబు నో... మరి ఆ పదవి ఎవరికో?

By:  Tupaki Desk   |   23 May 2019 11:10 PM IST
విపక్ష నేతగా బాబు నో... మరి ఆ పదవి ఎవరికో?
X
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనమే సృష్టించిందని చెప్పాలి. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో ఏకంగా 150 సీట్లకు పైగా సీట్లలో విజయ దుందుభి మోగిస్తున్న వైసీపీ... అధికార టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టేసిందనే చెప్పాలి. 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ... కేవలం 23 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సరే... అధికారం వైసీపీదే అని తేలిపోయిన తర్వాత టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినా... విపక్షంలో కూర్చోక తప్పదు కదా. గతంలో టీడీపీ విపక్షంలో ఉండగా... ఆ పార్టీ అధినేత - కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న నారా చంద్రబాబునాయుడు విపక్ష నేతగా కొనసాగారు కదా.

మరి ఇప్పుడు కూడా చంద్రబాబు ఆ పార్టీ అధినేతగానే ఉన్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచారు. మరి ఇప్పుడు కూడా టీడీపీ విపక్షంలో ఉంటే... చంద్రబాబు విపక్ష నేతగా వ్యవహరించాల్సిందే కదా. అయితే ఎన్నికల్లో గెలవలేకపోయామన్న బాధ కంటే కూడా తనకంటే చిన్న వయసున్న జగన్ సీఎంగా ఉంటే... తాను విపక్ష నేతగా ఎలా ఉంటానంటూ చంద్రబాబు దీర్గాలు తీస్తున్నారట. తన రాజకీయ అనుభవమంత వయసున్న జగన్ సీఎంగా ఉంటే.. తాను విపక్ష నేతగా ఉండలేనని ఆయన తన పార్టీ నేతల వద్ద తేల్చేశారట. విపక్ష నేతగా చంద్రబాబు నో అంటే... పార్టీకే చెందిన ఎవరినో ఒకరిని విపక్ష నేతగా కూర్చోబెట్టాలి కదా.

మరి ఈ ఎన్నికల్లో స్పీకర్ కోడెల లాంటి సీనియర్లతో పాటు నారా లోకేశ్ లాంటి యంగస్టర్ లు కూడా ఓటమిపాలైపోయారు. విపక్ష నేతగా వ్యవహరించడమంటే అంత వీజీ కాదు కదా. మరి చంద్రబాబు అంత అనుభవం - అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే నేర్పు ఉన్న నేత - గెలిచిన నేత ఎవరన్న విషయంపై ఇప్పటికే టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించిందట. ఈ క్రమంలో రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచి విజయం సాధించిన పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక్కరు మాత్రకే అధిష్ఠానానికి కనిపిస్తున్నారట. మరి సీనియారిటీని చూపి చంద్రబాబు తనకు వద్దన్న విపక్ష నేత హోదాలో గోరంట్ల కూర్చుంటారో - ఆయన కూడా బాబు మాదిరే చేతులెత్తేస్తారో చూడాలి.