Begin typing your search above and press return to search.

కర్ణాటక ఫ్యూచర్ సీన్ ఏంటి? కింగా? కింగ్ మేకరా?

By:  Tupaki Desk   |   11 May 2023 10:17 AM GMT
కర్ణాటక ఫ్యూచర్ సీన్ ఏంటి? కింగా? కింగ్ మేకరా?
X
యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం దిగ్విజయంగా పూర్తైంది. పోలింగ్ పూర్తై.. ఈవీఎంలు నిక్షిప్తమైన వేళ.. శనివారం విడుదలయ్యే ఫలితాల మీద ఇప్పుడు చర్చమొత్తం సాగుతోంది. కర్ణాటకలో వెల్లడయ్యే ఫలితాలు రానున్న రోజుల్లో పలు రాజకీయ పరిణామాలకు కీలకం కానున్నట్లు చెబుతున్నారు. కర్ణాటకలో బీజేపీ విజయం సాధిస్తే.. దేశ రాజకీయాల్లో మరికొంతకాలం కమలనాథులకు తిరుగే ఉండదు. అందుకు భిన్నంగా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం.. బీజేపీకి కష్టాలు మొదలైనట్లేనని చెప్పాలి.

ఎందుకంటే.. ఇంతకాలం తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తున్న బీజేపీ ఆత్మవిశ్వాసం మీద కర్ణాటక ఓటమి కొట్టే దెబ్బ అంతా ఇంతా కాదన్న మాట వినిపిస్తోంది. అందుకే.. ఈ ఎన్నికల్లో విజయం తప్పనిసరిగా భావిస్తోంది. మరో నాలుగు నెలల్లో ఛత్తీస్ గఢ్.. మధ్యప్రదేశ్.. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు వరుస పెట్టనున్న వేళ.. కర్ణాటక ఫలితం మిగిలిన ఎన్నికల మీదా ప్రభావం చూపటం ఖాయమంటున్నారు.

మరి.. కర్ణాటక ఫలితాలు ఎలా ఉంటాయి? ఏం జరగనుందన్నది ఉత్కంటగా మారింది. పోలింగ్ కు ముందు సాగిన చర్చ చూస్తే.. కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ ఈసారి లభిస్తుందన్న మాట బలంగా వినిపించింది.

అందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ను చూసినప్పుడు.. కాంగ్రెస్.. బీజేపీలకు సొంతంగా అధికారంలోకి రావటం కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తమయ్యేలా ఫలితాలు ఉన్నాయి. అదే జరిగితే.. జేడీఎస్ అపద్బాందవుడిగా మారుతుంది.

ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం చూస్తే.. జేడీఎస్ కు కనీసం 20 స్థానాల్లో గెలుపొందుతుందని.. అదే జరిగితే ఆ పార్టీ కింగ్ మేకర్ గా మారుతుందంటున్నారు. అయితే.. కింగ్ మేకర్ అవసరం లేదని.. సొంతంగా గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్.. బీజేపీల్లో వ్యక్తమవుతోంది.

మొత్తంగా కర్ణాటకలో కింగ్ ఎవరు? కింగ్ మేకర్ ఎవరన్న దానిపై చర్చ కొనసాగుతోంది. శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కానీ ఈ విషయం మీద పూర్తి క్లారిటీ రానుంది. అప్పటివరకు చర్చల పరంపర కొనసాగనుంది.