Begin typing your search above and press return to search.

సుబ్బయ్య ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు? ఏం చెప్పి తీసుకెళ్లాడు?

By:  Tupaki Desk   |   30 Dec 2020 6:47 AM GMT
సుబ్బయ్య ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు? ఏం చెప్పి తీసుకెళ్లాడు?
X
కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకున్న రాజకీయ హత్య పెను సంచలనంగా మారింది. దాదాపుగా పదేళ్ల నుంచి నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ హత్యలు లేవు. అందుకు భిన్నంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామం కొత్త తరహా రాజకీయానికి తెర తీస్తుందని చెప్పక తప్పదు. సుబ్బయ్యను హతమార్చేందుకు పక్కాగా ప్లాన్ చేసిన దుండగులు.. ఆయన బలహీనతపైన గురి పెట్టినట్లుగా చెప్పాలి.

అన్యాయం జరిగింది.. న్యాయం చేయాలని అడిగిన వెంటనే.. వారి వెంట వెళ్లటమే సుబ్బయ్య చేసిన పెద్ద తప్పుగా చెబుతున్నారు. రాజకీయాల్లో ఉన్న వారికి సహజంగా ఉండే అలవాటును హత్యకు ఆయుధంగా మార్చుకున్నారని చెబుతున్నారు. హత్య జరిగిన అనంతరం.. సుబ్బయ్యను ఇంటికి వచ్చి తీసుకెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో.. పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ మంగళవారం ఉదయం ఏం జరిగింది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. సుబ్బయ్య సతీమణి అపరాజిత చెబుతున్న వివరాలు కుట్ర కోణం ఇట్టే అర్థమయ్యేలా చేస్తోంది.

మంగళవారం ఉదయం 8.30 గంటల వేళలో ఒక వ్యక్తి తమ ఇంటికి వచ్చారని.. తనకు ఇంటి పట్టా రాలేదని.. అర్హత ఉన్నా అన్యాయం చేశారని చెప్పాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. దీంతో.. తన భర్త మాట్లాడేందుకు ఇంటి నుంచి వెళ్లారని.. అధికారుల్ని ప్రశ్నించి.. సెల్ఫీ తీసుకొని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. ఇది జరిగిన పది నిమిషాలకే దారుణంగా హత్య జరగటం చూస్తే.. న్యాయం చేయాలన్న ఉచ్చును విసిరి.. అందులో చిక్కుకునేలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుబ్బయ్య ఇంటికి వచ్చి తీసుకెళ్లిన వ్యక్తి ఆచూకీ లభిస్తే.. హత్య కేసులో కీలక కోణాలు బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.