Begin typing your search above and press return to search.

వీడికి ఉరిశిక్ష వేశారు.. చేసిన నేరం తెలిస్తే అది కూడా తక్కువే అంటారు

By:  Tupaki Desk   |   10 Feb 2021 4:03 AM GMT
వీడికి ఉరిశిక్ష వేశారు.. చేసిన నేరం తెలిస్తే అది కూడా తక్కువే అంటారు
X
మానవ మృగానికి ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది సైబరాబాద్ సెషన్స్ కోర్టు. అయితే.. అతడు చేసిన దారుణ నేరం గురించి తెలిస్తే.. ఉరి కూడా తక్కువే. వీడిని అంతకు మించి మరో రీతిలో శిక్షించాలన్న మాట రావటం ఖాయం. దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ దారుణంపై సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. నేరం జరిగిన తీరును చూసిన కోర్టు.. దీన్ని అసాధారణ ఘటనగా పరిగణించి.. వేగంగా విచారణ పూర్తి చేయటమే కాదు.. నేరస్తుడికి మరణదండన విధించారు. అసలేం జరిగిందంటే..

నార్సింగ్ లోని అల్కాపురి టౌన్ షిప్ లోని ఒక కార్మిక వాడలో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పని చేసేవారు. వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. అక్కడే మధ్యప్రదేశ్ కు చెందిన దినేష్ సెంట్రింగ్ పని చేసేవాడు. ఒడిశా దంపతులతో చనువుగా ఉండేవాడు. 2017 డిసెంబరు 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి ఐదేళ్ల కుమార్తెకు చాక్లెట్ల ఆశ చూపి నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు. గునుగు పూల పొదల వద్దకు తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు. అనంతరం.. తాను చేసిన పని గురించి చెబుతుందని.. బండరాయితో మోది హత్య చేశాడు.

అనంతరం రెండు కాళ్లను విరిచేసి.. అక్కడే పడేసి వెళ్లిపోయాడు. తాను చేసిన పని గురించి ఎవరికి చెప్పకుండా కామ్ గా ఉండటమే కాదు.. పాప కనిపించలేదంటే.. ఏమీ ఎరుగని వాడిలా పాప తల్లిదండ్రులతో కలిసి తిరుగుతూ.. వెతికేవాడు. దీంతో ఇతగాడి మీద ఎవరికి అనుమానం రాలేదు. రంగంలోకి దిగిన పోలీసులు.. పాపను చివరిసారిఎవరితో చూశారన్న ప్రశ్న వేస్తూ.. అక్కడి వారిని విచారించగా.. దినేష్ తోనే కనిపించిందన్న విషయాన్ని గుర్తించారు.

అతడ్ని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో.. అనుమానించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించటంతో పాటు.. అతడి లో దుస్తులకు గునుగుపూలు అంటుకొని ఉండటంతో అతనే నేరం చేసినట్లుగా భావించారు. వెంటనే తమదైన శైలిలో ప్రశ్నించగా.. తాను చేసిన దారుణం గురించి నోరు విప్పాడు. అనంతరం అతడు చూపించిన చోటే.. బాలిక డెడ్ బాడీ పడి ఉంది. అతడిపై అత్యాచారం.. హత్య.. ఫోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. నిందితుడ్ని దోషిగా పరిగణించటంతో పాటు.. వెయ్యి రూపాయిల జరిమానాతో పాటు ఉరిశిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏడు కేసుల్లో నిందితులకు ఉరిశిక్షలు విధించినట్లుగా చెబుతున్నారు.