Begin typing your search above and press return to search.

కేజ్రీపై పోటీదారు ఎవరు?..బీజేపీకి ఆప్ సవాల్!

By:  Tupaki Desk   |   31 Aug 2019 3:46 PM GMT
కేజ్రీపై పోటీదారు ఎవరు?..బీజేపీకి ఆప్ సవాల్!
X
దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసగా మూడో సారి విజయకేతనం ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్న అక్కడి అధికార పార్టీ అమ్ ఆద్మీ పార్టీ... తన ప్రత్యర్థి బీజేపీకి సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది. ఈ సవాళ్లలో భాగంగా ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్... బీజేపీకి ఓ భారీ సవాలే విసిరారు. తమ పార్టీ అధినేత - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ సింగ్ విసిరిన సవాల్ కు బీజేపీ నుంచి సమాధానం వస్తుందా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది. ఈ సవాల్ తో పాటు మరో రెండు సవాళ్లను బీజేపీకి సంధించిన సింగ్... ఢిల్లీలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశారని చెప్పక తప్పదు.

సంజయ్ సింగ్ విసిరిన సవాళ్లు ఎలా ఉన్నాయన్న విషయానికి వస్తే... సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పోటీకి దిగే బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అంటూ ఆయన చాలా సూటిగానే బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ నేత విజయ్ గోయల్ కు రాసిన ఓ లేఖలో సింగ్ ఈ ప్రశ్నతో పాటు మరో రెండు ప్రశ్నలను కూడా సంధించారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా ఇవ్వగలదా? ప్రజల నీటి బకాయిల మాఫీకి బీజేపీ అనుకూలమా? అంటూ ఆయన మరో రెండు ప్రశ్నలు అడిగారు. తాను అడిగిన ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలు ప్రజలకు సమాధానం ఇవ్వాలంటూ సంజయ్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. అందుకు 24 గంటలు గడువును కూడా ఆయన విధించారు.

సివిల్ సర్వెంట్ ప్రస్థానం ప్రారంభించిన అరవింద్ కేజ్రీవాల్... అన్నా హజారే చేపట్టిన ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చేశారు. వచ్చీ రాగానే ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నాడు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకిస్తూ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఢిల్లీలో శాంతిభద్రతలు ఎవరి పరిధిలోకి వస్తాయన్న విషయంపై కేంద్రంతో ఏకంగా అమీతుమీకే దిగిన కేజ్రీ... సీఎంగా తన పదవీ కాలం ముగియకుండానే రాజీనామా చేసి మరోమారు ఎన్నికలకు వెళ్లారు. ఇలా రెండో సారి జరిగిన ఎన్నికల్లో అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీకి కూడా బిగ్ షాకిచ్చిన కేజ్రీ... వరుసగా రెండో పర్యాయం కూడా ఢిల్లీలో అధికార పగ్గాలు అందుకున్నారు. ఇదే క్రమంలో వరుసగా మూడో సారి కూడా ఢిల్లీలో విజయం తమదేనన్న ధీమాతో సాగుతున్న ఆప్... ఇప్పుడు కాంగ్రెస్ ను వదిలి బీజేపీని టార్గెట్ చేసింది. మరి ఆప్ విసిరిన సవాళ్లకు బీజేపీ స్పందిస్తుదో - లేదో చూడాలి.