Begin typing your search above and press return to search.

వైఎస్ కు కేవీపీ.. మ‌రి జ‌గ‌న్‌ కు..?

By:  Tupaki Desk   |   31 May 2019 5:30 PM GMT
వైఎస్ కు కేవీపీ.. మ‌రి జ‌గ‌న్‌ కు..?
X
దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు.. ఆయ‌న ఆత్మ‌గా కేవీపీ రామ‌చంద్ర‌రావును పిలుస్తుంటారు. వారిద్ద‌రి మ‌ధ్య స్నేహ‌బంధం గురించి.. వారిద్ద‌రి మ‌ధ్య అవ‌గాహ‌న గురించి మీడియా స‌ర్కిల్స్ కు తెలిసినా.. సీనియ‌ర్ పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్స్ కు బాగా తెలుసు.

ఈ మ‌ధ్య‌న వైఎస్ బ‌యోపిక్ పుణ్య‌మా అని.. వైఎస్ కు కేవీపీ ఎంత స‌న్నిహితుడో.. వారిద్ద‌రి మ‌ధ్య అనుబంధం ఎంత‌న్న విష‌యం రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బాగా అర్థ‌మైంద‌ని చెప్పాలి. వైఎస్ కు కేవీపీ ఉన్నారు స‌రే? మ‌రి.. జ‌గ‌న్ కు ఎవ‌రున్నారు? ఆయ‌న ఒక్క‌రేనా? ఎవ‌రిని న‌మ్మ‌రా? అన్న సందేహాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తుంటారు. కానీ.. అది నిజం కాదు.

జ‌గ‌న్ కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని చూసుకోవ‌టంతోపాటు.. ప్ర‌తి అంశానికి జ‌గ‌న్ న‌మ్మే వ్య‌క్తి.. ఆధార‌ప‌డే వ్య‌క్తి ఒక‌రున్నారు. ఆయ‌నే.. విజ‌య‌సాయిరెడ్డి. ఎన్నిక‌ల వేళ‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంత‌లా శ్రమించారో.. అదే స్థాయిలో ప‌ని చేసిన వ్య‌క్తి విజ‌య‌సాయి రెడ్డి. స్క్రీన్ మీద క‌నిపించేది జ‌గ‌న్ అయినా.. దానికి సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ చేసేది విజ‌య‌సాయి రెడ్డి. కాకుంటే.. కేవీపీ మాట్లాడేవారు కాదు.. విజ‌య‌సాయి మాట్లాడ‌తారంతే.

జ‌గ‌న్ పార్టీలో హార్డ్ కోర్ నేత‌గా విజ‌య‌సాయి అంద‌రికి సుపరిచితుడు. ఆయ‌న‌లోని కేవీపీ కోణం తాజాగా జ‌రిగిన ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించింది. జ‌గ‌న్ కు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించే విజ‌య‌సాయి.. కీల‌క‌మైన ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా ఒక ప‌క్క‌గా ఒదిగిపోయిన‌ట్లుగా కూర్చుండిపోయారు.

ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న జ‌గ‌న్ కు కాస్త దూరంగా ఉన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. కేవీపీ కూడా ఇదే తీరును ప్ర‌ద‌ర్శిస్తార‌న్న విష‌యాన్ని కొంద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు మాట్లాడుకోవ‌టం క‌నిపించింది. దూరంగా ఉన్న‌ట్లే ఉంటూ.. అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉండే కేవీపీకి త‌గ్గ‌ట్లే.. జ‌గ‌న్ విష‌యంలో విజ‌య‌సాయి వ్య‌వ‌హార‌శైలి అదే తీరు ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు ఆయ‌న ప‌డిన త‌ప‌న అంతా ఇంతా కాదు. ఇంతా చేసిన ఆయ‌న‌.. కేవీపీ మాదిరి ప‌ద‌వి ఏమీ తీసుకోకుండా చ‌క్రం న‌డుపుతారా? లేక‌.. అందుకు భిన్నంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త పోషిస్తారా? అన్న‌ది తేలాల్సి ఉంది.