తెలంగాణలో స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో చాలా చోట్ల స్థానాలు అధికార టీఆర్ఎస్‌కు ఏకగ్రీవం అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ మేయర్ సునీల్ రావు కొత్త డౌట్ వ్యక్తం చేశారు. ఆయన తెలంగాణ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను పోటీలో పెట్టలేదని ముందు నుంచే చెపుతున్నాయని.. తమ పార్టీ నుంచి ఎల్.రమణ, భానుప్రసాద్ రావు అభ్యర్థులుగా ఉన్నారని ఆయన చెప్పారు.
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయా లేదా ఈటల రాజేందరా అన్నది అర్థం కావడం లేదని సునీల్‌రావు ఎద్దేవా చేశారు. తాము ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయడం లేదని బండి సంజయ్ చెప్పారని.. అయితే ఈటల రాజేందర్ మాత్రం తాము పోటీ పెట్టామని చెపుతున్నారని.. దీనిని బట్టి చూస్తే బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్టు అర్థమవుతోందన్నారు.
ఈటల రాజేందర్ ఇక్కడ పోటీ పెట్టిన అభ్యర్థి కాంగ్రెస్ వాళ్లను కలుస్తుండడం దేనికి సంకేతమని... దమ్ముంటే సొంత పార్టీ ద్వారా పోటీ చేయాలే తప్పా .ఈ ద్వంద రాజకీయాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అలాగే బీజేపీ ఎంపీ ఓ స్టేట్‌మెంట్, ఎమ్మెల్యే మరో స్టేట్‌మెంట్ ఇస్తున్నారని కూడా సునీల్ రావు ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌కు ఈటల చెక్ పెట్టాలని చూస్తున్నాడని. బీజేపీ అధ్యక్షుడు మారే అవకాశం ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక హుజూరాబాద్‌లో కూడా కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేసి అమ్ముడు పోయిందని.. బండి సంజయ్‌కు తెలియకుండానే ఈటల పెట్టిన అభ్యర్థికి బీజేపీ కార్పోరేటర్లు సపోర్ట్ చేస్తున్నారని.. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని సునీల్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇక టీఆర్ఎస్ పతనం అయ్యిందని రవీందర్ సింగ్ అన్నారని.. కానీ పతనం అయ్యింది రవీందర్ సింగే అని.. మేయర్‌గా ఉండి ఒక్క కార్పోరేటర్‌కు కూడా హెల్త్ కార్డు ఇవ్వలేదని.. ఇప్పుడు ఎంపీటీసీలకు ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.