Begin typing your search above and press return to search.

నెక్ట్స్ సీఎస్ ఎవ‌రో? జ‌గ‌న్ ఏమ‌నుకుంటున్నారు?

By:  Tupaki Desk   |   6 Dec 2021 1:50 PM IST
నెక్ట్స్ సీఎస్ ఎవ‌రో? జ‌గ‌న్ ఏమ‌నుకుంటున్నారు?
X
ఆంధ‌ప్ర‌దేశ్‌కు కాబోయే సీఎస్ ఎవ‌రు? జ‌గ‌న్ ఎవ‌రి పేర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారు? ఆయ‌న మ‌న‌సులో ఏముంది?.. ఇవే ఇప్పుడు అక్క‌డి ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుత ఏపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా (ఛీఫ్ సెక్ర‌ట‌రీ)గా స‌మీర్ శ‌ర్మ ఉన్నారు. 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన స‌మీర్ గ‌త జులైలో కేంద్ర స‌ర్వీసుల నుంచి రిలీవ్ అయ్యి రాష్ట్ర స‌ర్వీసులోకి వ‌చ్చారు.

సీఎస్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించే నాటికి ఆయ‌న స‌ర్వీస్ మ‌రో రెండు నెల‌లు మాత్ర‌మే మిగిలి ఉంది. అక్టోబ‌ర్‌లో సీఎస్ కుర్చీలో కూర్చున్న ఆయ‌న న‌వంబ‌ర్ నెలాఖ‌రుకు రిటైర్ కావాల్సి ఉంది. కానీ జ‌గ‌న్ ఇష్టం మేర‌కు ఆయ‌న స‌ర్వీసును ఆరు నెల‌ల పాటు రెండు ద‌ఫాలుగా పొడిగించే వెసులుబాటు ఉంది. అయిన‌ప్ప‌టికీ స‌మీర్ త‌ర్వాత ఏపీ సీఎస్ ఎవ‌రిని నియ‌మించాల‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ క‌స‌ర‌త్తులు మొద‌లెట్టిన‌ట్లు స‌మాచారం.

సాధార‌ణంగా అయితే రాష్ట్రంలో ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిని సీఎస్‌గా నియ‌మించ‌డం ఆన‌వాయితీ. కానీ కొన్ని రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల కొన్ని సంద‌ర్భాల్లో సీనియారిటీని ప‌క్క‌కు పెట్టి త‌మ‌కు అనుకూల‌మైన వాళ్ల‌ను ఆ కూర్చీలో కూర్చోబెట్ట‌డం ప‌రిపాటిగా మారింది. ఇప్పుడు స‌మీర్ స‌ర్వీస్‌ను మ‌రో ఆరు నెల‌లు పొడిగించార‌నుకుందాం.

అప్పుడు సీనియారిటీ ప్ర‌కారం చూస్తే సీఎస్ రేసులో ఉండే అజ‌య్ సాహ్నీ, రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యం, స‌తీష్ చంద్ర వంటి వాళ్ల‌కు మ‌రో ఏడాది మాత్ర‌మే స‌ర్వీసు మిగిలి ఉంటుంది. దీంతో వాళ్ల‌కు అవ‌కాశం లేన‌ట్లే. ఆ నేప‌థ్యంలో 1988 బ్యాచ్‌కు చెందిన మ‌రో సీనియ‌ర్ అధికారిణి వై.శ్రీల‌క్ష్మీకి ఆ ఛాన్స్ ద‌క్క‌వ‌చ్చ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ కేడ‌ర్ నుంచి ఏపీ కేడ‌ర్‌కు వ‌చ్చిన ఆమె ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ హోదా పొంది రెండు నెల‌లు తిర‌క్కుండానే స్పెష‌ల్ ఛీఫ్ ప్ర‌మోష‌న్ అందుకోవ‌డంతో అప్ప‌ట్లో ఐఏఎస్ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే సాగింది.

మ‌రోవైపు ఓబులాపురం మైనింగ్ కేసులో, జ‌గ‌న్ కేసుల‌లో స‌హ నిందితురాలిగా జైలుకు కూడా వెళ్లి వ‌చ్చిన శ్రీల‌క్ష్మీకి జ‌గ‌న్ మేలు చేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త‌దుప‌రి సీఎస్‌గా ఆమెనే ఎంపిక చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అందుకే ప‌ట్టుబ‌ట్టి మ‌రీ తెలంగాణ ఉంచి ఏపీ కేడ‌ర్‌కు మార్చార‌నే ప్ర‌చారం జ‌రిగింది.

కానీ సీఎస్‌గా ఆమెను నియ‌మిస్తే న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వ‌స్తాయేమోన‌న్న అనుమానాలు ప్ర‌భుత్వానికి క‌లుగుతున్నాయి. ఒక‌వేళ శ్రీల‌క్ష్మీని సీఎస్‌గా నియ‌మించ‌ని ప‌క్షంలో పూనం మాల‌కొండ‌య్య‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌జెప్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్‌గా ఉన్న‌పుడు త‌న ముక్కుసూటి త‌నంతో ఆమె మ‌ల్లీనేష‌న‌ల్ కంపెనీకే చుక్క‌లు చూపించార‌ని టాక్‌.

దీంతో ఆమెను సీఎస్‌గా నియ‌మిస్తే అవినీతిని అరిక‌ట్టేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆమె నియామ‌కానికి సంబంధించి ఇప్ప‌టికే సీఎం ముఖ్య కార్య‌దర్శి ప్ర‌వీణ్ ప్ర‌కాష్ ఆధ్వ‌ర్యంలో క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ కూడా పూనం వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు తెలిసింది.