Begin typing your search above and press return to search.

ద‌ళాన్ని న‌డిపే పెద్ద‌న్న ఎవ‌రు?

By:  Tupaki Desk   |   27 Jun 2021 3:30 PM GMT
ద‌ళాన్ని న‌డిపే పెద్ద‌న్న ఎవ‌రు?
X
దోపీడీ దారుల అధికారాన్ని కూల‌దోసి.. స‌మ‌స‌మాజాన్ని స్థాపించ‌డ‌మే ల‌క్ష్యంగా పురుడు పోసుకున్న ఉద్య‌మం క‌మ్యూనిజం. భార‌త‌దేశంలో క‌మ్యూనిజానిది వందేళ్ల ప్ర‌స్థానం. అయితే.. సైద్ధాంతిక విభేదాల‌తో ఎర్ర‌జెండా చీలిక‌లు పీలిక‌లైపోయింది. ఇందులో ప్ర‌ధానంగా చూసుకున్న‌ప్పు సీపీఐ, సీపీఎం, మావోయిస్టు పార్టీలు ప్ర‌ముఖంగా ఉన్నాయి. అయితే.. సీపీఐ, సీపీఎం ప్ర‌జాక్షేత్రంలో ఉంటూ పోరాటం సాగిస్తుండ‌గా.. చైనా, క్యూబా త‌ర‌హాలో తుపాకీ గొట్టంతోనే విప్ల‌వం వ‌స్తుంద‌ని న‌మ్ముతున్న‌వారు మావోయిస్టులు. ప్ర‌జాస్వామ్యంలో ఆయుధాలు ప‌ట్టుకు తిరగ‌డం నేరం గ‌నుక‌.. అడ‌వుల్లో ఉంటూ విప్లవోద్యమాన్ని వీరు న‌డిపిస్తున్నారు.

అయితే.. త్యాగాల విష‌యంలో మావోయిస్టుల‌ది అగ్ర‌స్థానం. ప్రాణాల‌పై ఆశ వ‌దిలేసుకున్న‌వారే ఈ ఉద్య‌మంలో అడుగు పెడ‌తారు. ప్ర‌జ‌ల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌వారే బంధూకు అందుకుంటారు. దొరికిన‌ప్పుడే తిండీ.. తాగిన‌ప్పుడే నీళ్లు.. ఇవాళ నిద్రించిన మ‌ర్నాడు సూర్యున్ని చూశారంటే.. ఆ రోజుకు బ‌తికిపోయిన‌ట్టు లెక్క‌. ఈ విధంగా.. దిన దిన గండంగా బ‌తుకు బండి సాగిస్తూ.. ప్ర‌జల కోసం పోరాటం చేస్తుంటారు.

వీళ్ల‌ త్యాగం అన‌న్యసామాన్యం అయిన‌ప్ప‌టికీ.. వారు ఎంచుకున్న దారే స‌రైంది కాద‌న్న‌ది చాలా మంది మేథావుల మాట‌. ప్రాణానికి ప్రాణ‌మే న్యాయ‌మైన‌ప్పుడు.. దోపిడీకి చావే ప‌రిష్కారం అయిన‌ప్పుడు.. స‌మాజంలో అరాచ‌కం పెరిగిపోతుంద‌న్న‌ది వారి అభిప్రాయం. చ‌ట్టం చెబుతున్న‌ది కూడా ఇదే.. పంటికి ప‌న్ను.. కంటికి క‌న్ను సిద్ధాంతం రాతియుగానికి చెందిన‌ది.. రాచ‌రికానికి సంబంధించిన‌ది. ప్ర‌జాస్వామ్యంలో శాంతియుత నిర‌స‌న‌లతో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌నేది మెజారిటీ అభిప్రాయం.

కానీ.. చ‌ట్టాల‌న్నీ దోపిడీ దారుల‌కే అనువుగా ఉన్న చోట‌.. దోపిడీ దారులే చ‌ట్టాల‌ను రూపొందిస్తున్న చోట‌.. వాళ్లే అమ‌లు చేస్తున్న చోట‌.. సామాన్యుడికి న్యాయం ఎక్క‌డ జ‌రుగుతుంద‌న్న‌ది మావోయిస్టుల సూటి ప్ర‌శ్న‌. దీనికి వారు చూపించే సాక్ష్యాల‌కు, ఆధారాల‌కూ కొద‌వ లేదు కూడా. అయిన‌ప్ప‌టికీ.. చంప‌డం లేదా చావ‌డం ద్వారానే వ‌స్తుంద‌నే విప్ల‌వాన్ని మెజారిటీ జ‌నం ఆమోదించ‌లేదు. దీంతో.. ఆవేశం మీద‌నే మావోయిస్టు ఉద్య‌మం న‌డుస్తోంద‌నే విమ‌ర్శ‌ కూడా ఉంది. అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఇంకా అడ‌విలో అన్న‌లు త‌మ పోరాటం కొన‌సాగిస్తూనే ఉన్నారు.

అయితే.. వారికి ఉన్న ప్ర‌తికూల‌త‌లు ఎన్నో.. క‌నీసం తిండి దొర‌క్క‌పోవ‌డం నుంచి వైద్య స‌దుపాయ‌లు కూడా క‌రువైన చోట ఎంతో మంది కార్య‌క‌ర్త‌లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఓ వైపు పోలీసుల నుంచి నిత్యం స‌వాళ్లు ఎదుర్కొంటున్న న‌క్సలైట్ల‌ను.. ఇప్పుడు క‌రోనా మ‌హమ్మారి కూడా భారీగా దెబ్బ‌తీసింది. మైదానంలోని జ‌నం నుంచి అడ‌విలోకి సైతం విస్త‌రించిన క‌రోనా.. ఎంతో మంది కార్య‌క‌ర్త‌ల‌ను, కీల‌క‌మైన నేత‌ల‌ను బ‌లిగొన్న‌ది. ఈ కొవిడ్ తోనే తెలంగాణ రాష్ట్ర‌కార్య‌ద‌ర్శి హ‌రిభూష‌ణ్ ప్రాణాలు కోల్పోయారు.

దీంతో.. రాష్ట్రంలో పార్టీని న‌డిపించే పెద్ద‌న్న కోసం కేంద్ర నాయ‌క‌త్వం వెతుకులాడుతోంది. ఈ విష‌యాన్ని పోలీసు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు కూడా నిశితంగా ప‌రిశీలిస్తున్నాయి. అయితే.. సీనియ‌ర్ నేత‌లుగా ఉన్న లోకేటి చంద‌ర్‌, దామోద‌ర్‌, బండి ప్ర‌కాశ్‌, సాంబ‌య్య వంటి నేత‌ల పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌రి, వీరిలో ఎవ‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారు? అనేది చూడాలి.