Begin typing your search above and press return to search.

రేణుకను ఎవరు అడ్డుకుంటున్నారు ?

By:  Tupaki Desk   |   2 March 2023 1:00 PM GMT
రేణుకను ఎవరు అడ్డుకుంటున్నారు ?
X
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. తాను ఏపీ మొత్తం తిరుగుతానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని రెచ్చిపోయారు. ఇక్కడే విషయం అర్ధం కావటం లేదు. అసలు ఏపీలో రేణుక తిరుగుతానంటే అడ్డుకున్నదెవరు ? రేణుకా చౌదరి ఏపీలో పర్యటిస్తానంటే ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేశారా ? ఒకవైపు రెగ్యులర్ గా ఏపీలో ఎప్పటినుండో తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ తనను ఎవరైనా ఆపితే వాళ్ళ కత చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వటమేమిటో అర్ధం కావటం లేదు.

వచ్చే ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీకి కానీ విజయవాడ ఎంపీకి కానీ పోటీచేయాలన్న తన కోరికను బయటపెట్టారు. సంతోషమే పోటీ చేస్తే కాదనేది కూడా లేదు. ఎలాగూ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి అభ్యర్దులు లేరు. కాబట్టి రేణుక పోటీ చేస్తే ఏపీ కాంగ్రెస్ కూడా కాదనే అవకాశాలు తక్కువే. మరి మధ్యలో అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని కండీషన్ పెట్టడం ఏమిటి ? జన్మతహ వైజాగ్ కు చెందిన రేణుక ఏపీలో పోటీ చేస్తానంటే అధిష్టానం మాత్రం కాదంటుందా ?

వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుకు లేదా గుడివాడ అసెంబ్లీకి పోటీచేసి రేణుక తన కెపాసిటి ఏమిటో అందరికీ చూపిస్తే బాగుంటుంది. నిజానికి మాజీ మంత్రి ఎంపిక చేసుకున్న రెండు నియోజకవర్గాలు కూడా గట్టి నియోజకవర్గాలే. తన కెపాసిటిని నిరూపించుకునేందుకు సరైన నియోజకవర్గాలనే రేణుక ఎంపిక చేసుకున్నారు. కాకపోతే అనవసరమైన మాటలు మాట్లాడకుండా రెగ్యులర్ గా నియోజకవర్గాల్లో పర్యటనలు మొదలుపెడితే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకున్నట్లవుతుంది. అలాగే వ్యక్తిగతంగా రేణుకకు కూడా మంచి మైలేజీ మొదలవుతుంది.

ఇక టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్ధులంటారా ఎవరు పోటీ చేస్తే మాత్రం రేణుకకు ఎందుకు ? ఎందుకంటే ఆమె టార్గెట్ అంతా వైసీపీ అభ్యర్ధిని ఓడించటమే కదా. గుడివాడలో కొడాలి నాని పోటీచేయటం ఖాయమే. ఇక విజయవాడ ఎంపీ అభ్యర్ధి ఎవరో తేలాల్సుంటంది. ఎలాగూ విజయవాడ పార్లమెంటు స్ధానం కమ్మోరికి మంచి ప్రాబల్యం కలిగున్న సీటే. కాబట్టి రేణుకా చౌదరి తన కెపాసిటీ చూపించి వైసీపీని ఓడించేస్తే చాంపియన్ గా నిలవచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.