Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ బాధ్య‌త‌లు ఎవ‌రికి?

By:  Tupaki Desk   |   17 Jun 2021 1:30 AM GMT
హుజూరాబాద్ బాధ్య‌త‌లు ఎవ‌రికి?
X
ఈట‌ల బీజేపీలో చేరిపోయారు. ఆయ‌న రాజీనామా కూడా ఆమోదం పొందింది. ఇక మిగిలింది హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు న‌గారా మోగ‌డ‌మే. మ‌రి, ఈ ఉప ఎన్నిక‌ బాధ్య‌త‌ల‌ను కేసీఆర్ ఎవ‌రికి అప్ప‌గిస్తారు అన్న‌ది కీల‌కంగా మారింది. ఇటు కొడుకు కేటీఆర్ కు అప్ప‌గిస్తారా? అటు అల్లుడు హ‌రీశ్ రావును బ‌రిలోకి దించుతారా? అత్యంత ప్రతిష్టాత్మక సమరం కాబట్టి.. స్వయంగా తానే రంగంలోకి దిగుతారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ ఎన్నికలో గెలుపు టీఆర్ఎస్ కు ఎంత ముఖ్య‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. దుబ్బాక ఉప ఎన్నిక త‌ర్వాత టీఆర్ఎస్ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని ప్ర‌చారం చేశారు బీజేపీ నాయ‌కులు. ఆ త‌ర్వాత జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో క‌మ‌ల‌ద‌ళం ఊహించని రీతిలో స్థానాలు గెలుచుకోవ‌డంతో.. ఆ పార్టీ నేత‌ల జోరుకు అడ్డే లేకుండాపోయింది. అధికారానికి తాము అడుగు దూరంలోనే ఉన్నామ‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఎమ్మెల్సీ, సాగ‌ర్ ఎన్నిక‌లో టీఆర్ఎస్ గెలిచి స‌మం చేసింది.

కానీ.. హుజూరాబాద్ లో జ‌రిగే ఉప ఎన్నిక సాధార‌ణ లెక్క‌లోకి తీసుకోవ‌డానికి లేదు. రెండు ద‌శాబ్దాల‌పాటు కేసీఆర్ వెంట ఉన్న ఈట‌ల‌తో జ‌రుగుతున్న స‌మ‌రం ఇది. కేసీఆర్ కుటుంబ త‌ర్వాత టీఆర్ఎస్ లో పెద్ద నేత‌గా ఉన్న రాజేంద‌ర్ తో జ‌రుగుతున్న యుద్ధమిది. ఆరు సార్లు ఆయ‌న‌ ఏక‌ఛ‌త్రాధిప‌త్యం కొన‌సాగించిన నియోజ‌క‌వ‌ర్గంలో ఓడించ‌డానికి సాగిస్తున్న పోరాట‌మిది. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈట‌ల‌ను బ‌య‌ట‌కు పంపించార‌నే సానుభూతి వ్య‌క్త‌మైన వేళ జ‌ర‌గ‌బోతున్న ఉప ఎన్నిక ఇది. అందువ‌ల్ల‌.. దీన్ని సాధార‌ణంగా తీసుకోవ‌డానికి లేదు. ఈ విష‌యం కేసీఆర్ కు తెలియ‌నిది కాదు.

ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత ఏకంగా తొంభైశాతం ప్ర‌జాప్ర‌తినిధులు ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు. ఆ త‌ర్వాత అధిష్టానం చేసిన ఆప‌రేష‌న్ తో కొద్ది మంది వెన‌క్కు త‌గ్గినా.. చాలా మంది ఈట‌ల‌కు అండ‌గానే ఉన్నార‌నే ప్ర‌చార‌మైతే ఉంది. ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొని విజ‌యం సాధించ‌డం చిన్న విష‌య‌మైతే కాదు. మరి, ఇంత‌టి ముఖ్య‌మైన యుద్ధానికి సార‌ధిగా కేసీఆర్‌ ఎవ‌రిని నియ‌మించ‌బోతున్నాడ‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంది.

దుబ్బాక ఉప ఎన్నిక బాధ్య‌త‌ను హ‌రీశ్‌ రావుకు అప్ప‌గించ‌డం.. జీహెచ్ఎంసీ బాధ్య‌త‌ల‌ను కేటీఆర్ కు ఇవ్వ‌డంతో.. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఓడిపోతామ‌నుకున్న చోట హ‌రీశ్ ను ముందు పెడుతున్నార‌ని, గెలిచే చోట కేటీఆర్ కు ప‌గ్గాలు ఇస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. మ‌రి, ఇక్క‌డ ఏం చేయ‌బోతున్నారు? హుజూరాబాద్ లో తేడా వ‌స్తే.. హ‌రీశ్ పైకి నెట్టేస్తామంటే కుద‌ర‌దు. ఏం జ‌రిగినా.. ఫ‌లితం పొందేది కేసీఆర్ మాత్ర‌మే. మ‌రి, ఇంత ముఖ్య‌మైన స‌మ‌రంలో ఆయ‌నే నేరుగా దిగుతారా? ఇత‌రుల‌కు బాధ్య‌త‌లు ఇస్తారా? అన్న‌ది చూడాలి.