Begin typing your search above and press return to search.

మోడీ దిగిపోతారా.. ఆ ఇద్దరూ వెయిటింగ్... ?

By:  Tupaki Desk   |   26 Dec 2021 8:30 AM GMT
మోడీ దిగిపోతారా..  ఆ ఇద్దరూ వెయిటింగ్... ?
X
మోడీ సుదీర్ఘ కాలం పాలకుడిగా ఉన్నారు. ఈ మధ్యనే ఆయన తరఫున బీజేపీ వారు గర్వంగా చెప్పుకున్నట్లు పదమూడేళ్ల పాటు గుజరాత్ ముఖ్యామంత్రిగా, ఎనిమిదేళ్ళ పాటు దేశానికి ప్రధానిగా నిరాటంకంగా మోడీ ఏలుతున్నారు. ఆయన ఒక్క రోజు కూడా ఆఫీస్ కి సెలవు పెట్టలేదు, అంటే రెండు దశాబ్దాలుగా మోడీ ఆన్ డ్యూటీ మీదే ఉన్నారు. యాభైఏళ్ల వయసులో ఆయన గుజరాత్ ముఖ్యామంత్రిగా పాలనా పగ్గాలు చేపడితే ఏడు పదుల వయసు వచ్చేసినా ప్రధానిగా ఆ బరువు బాధ్యతలు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గడంలేదు.

ఇక ఇప్పటికి రెండు సార్లు కేంద్రంలో బీజేపీ గెలిచింది. రెండు సార్లు ఫుల్ మెజారిటీ దక్కించుకుంది. 2024 ఎన్నికల్లో మూడవసారి కూడా గెలిచి హ్యాట్రిక్ పీఎం కావాలని మోడీ తలపోస్తున్నారు. ఈ దఫా గెలిచి పూర్తి కాలం ఆయన కొనసాగితే గాంధీ నెహ్రూ ఫ్యామిలీని అధిగమించి ప్రధానిగా రికార్డు బద్ధలు కొట్టడం ఖాయం. అయితే ఈ అవకాశం మోడీకి దక్కేనా అంటే దానికి ముందు చాలా అంశాలు చూడాలి. మోడీ ప్రధాని అయ్యాక అమిత్ షా బీజేపీకి జాతీయ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీలో ఒక కఠిన నియమం తెచ్చారు.

అదేంటి అంటే బీజేపీలో ఎవరైనా నాయకుడికి 75 ఏళ్ళు నిండితే వారికి ఇక అధికార యోగం కల్లే. అంటే వారు స్వచ్చందంగా రాజకీయాల నుంచి విరమించాల్సి ఉంటుంది. ఆ నిబంధనను చెప్పే బీజేపీలో భీష్మాచార్యుడు అద్వానికి అప్పట్లో ఇంటికి పంపించేశారు. అలాగే మరో బీజేపీ కురు వృద్ధుడు మురళీ మనోహర్ జోషీని కూడా సైడ్ చేశారు. నాడు ఆ నియమం పెట్టినపుడు మోడీ మాస్టార్ వయసు 64 ఏళ్ళే. అయితే ఇపుడు ఆయన వయసు అచ్చంగా 71. మరో రెండున్నరేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల వేళకు ఆయనకు 74 ఏళ్ళు నిండుతాయి.

ఒకవేళ ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా మోడీ ప్రధానిగా ఉండేది కేవలం ఏడాది మాత్రమే. ఎందుకంటే ఇది మోడీ తెచ్చిన రూల్. మరి ఆయనే పాటించాలి కదా. అలా కాదు ఈ టెర్మ్ అంతా నేనే అంటే మాత్రం ఆయన 79 ఏళ్ల వయసు వచ్చేదాకా ప్రధానిగా ఉంటారు. కానీ బీజేపీలో అలా జరుగుతుందా. మోడీ తెచ్చిన రూల్ ని అమలు చేయమని కోరే వారు చాలా మందే ఉంటారు. అందరూ ఎందుకు ఆయన తరువాత స్థానంలో ఉన్న అమిత్ షా వే ఉంటారు. వచ్చే ఎన్నికల తరువాత మోడీకి 75 ఏళ్ళు వస్తే అమిత్ షాకు 60 ఏళ్ళు వస్తాయి. సో ఆ విధంగా మోడీ ప్రధాని సీటు ఖాళీ చేస్తే ఎక్కేది ఆయనే అన్న మాట అయితే బీజేపీలో గట్టిగా వినిపిస్తోంది.

ఇక మరో నేత కూడా ఆ సీటు మీద గురి పెట్టి ఉన్నారు. ఆయన ఎవరో కాదు యూపీ సీఎం ఆదిత్యానాధ్ యోగీ. ఆయన యోగం ఏ లెవెల్ లో ఉంది అంటే 1998తో మొదలెట్టి వరసగా ఎంపీగా యూపీలోని ఘోరక్ పూర్ నుంచి ఇప్పటికి అయిదు సార్లు గెలిచారు. మోడీ సర్కార్ లో కేంద్ర మంత్రిగా పనిచేసిన యోగీ 2017 నుంచి యూపీ సీఎం గా ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న సర్వేలు చూస్తే మరోసారి యూపీలో గెలిచేది బీజేపీనే అని అంటున్నారు.

అంటే యోగీ వరసగా రెండవసారి సీఎం అవడం ఖాయమన్న మాట. మోడీ తర్వాత ప్రధాని అయ్యే చాన్స్ ఎక్కువగా ఉన్నది యోగీకే అని అంతా అంటారు. ఆయన వీర హిందూత్వ విధానాలు ఆరెస్సెస్ కి బాగా ఇష్టమని చెబుతున్నారు. మోడీ తాను పెట్టుకున్న నిబంధనల ప్రకారం 75 ఏళ్లు రాగానే అంటే 2025 సెప్టెంబర్ 17 తరువాత ఏ రోజైనా ప్రధాని పదవికి రాజీనామా చేస్తే ఆ అత్యున్నత పీఠాన్ని అధిరోహించబోయేది కచ్చితంగా యోగీయే అని అంతా అంటున్నారు.

యోగీకి ఉన్న ప్లస్ పాయింట్లు ఎక్కువ. ఆయన సాధువుగా, ఘోరక్ పూర్ పీఠాధిపతిగా ఉన్నారు. హిందూత్వ అంటే ప్రాణం పెడతారు. ఇక దూకుడు చేయడంతో మోడీని మించే నేత. ప్రజాకర్షణలో కూడా సరిసాటి. అదే అమిత్ షా విషయం వస్తే వ్యూహకర్త అన్న మాట తప్ప ఆయనకు జనంలో పలుకుబడి తక్కువ. అయితే మోడీ ఒకవేళ తాను కుర్చీ దిగిపోతే ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఒకే రాష్ట్రం వారు అన్న ఫీలింగ్ ఉంటే అమిత్ షాకే మోడీ ఓటేస్తారు అని చెబుతారు. ఇక ఆరెస్సెస్ వాదన కూడా నెగ్గితే యోగీ పీఎం కావడం ఖాయం. ఎలా చూసుకున్నా కూడా మోడీ మాస్టార్ కుర్చీ కోసం ఈ ఇద్దరూ వెయిటింగ్ అనే చెప్పుకోవాలి మరి.