Begin typing your search above and press return to search.

టీపీసీసీకి ఉత్తమ్ వారసుడెవరు?

By:  Tupaki Desk   |   26 Jun 2019 9:34 AM GMT
టీపీసీసీకి ఉత్తమ్ వారసుడెవరు?
X
జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ మెట్టుదిగడం లేదు. రెండు రోజులుగా మళ్లీ టచ్ లోకి వచ్చారు. యూపీ, కర్ణాటకలో పీసీసీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఓడిపోయిన తెలంగాణలోనూ పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నలుగురైదుగురు పీసీసీ పదవికి పోటీపడుతున్నారు.

*రేసులో ముందున్న రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనగల సామర్థ్యం ఉండడం.. మంచి మాటకారి.. అందరినీ మేనేజ్ చేసే టాలెంట్ ఉండడంతో రేవంత్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. దూకుడైన నేతగా రేవంత్ అందరికంటే పీసీసీ రేసులో ముందున్నారు. పైగా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి సీఎంగా కూర్చోవాలన్నది రేవంత్ చిరకాల ఆశ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

*సీనియర్ అయితే జీవన్ రెడ్డి
జీవన్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొరకగాని కొయ్యగా మారారు. జగిత్యాలలో ఓడినా ఎమ్మెల్సీగా గెలిచి పదునైన మాటలు తూటాలు పేల్చగల నేత. పైగా ఉత్తర తెలంగాణ నేత కావడంతో ఈయనకు దక్కే అవకాశాలున్నాయి. అయితే వయోభారం.. జిల్లాలకు తిరగగల సామర్థ్యం లేకపోవడం ఈయనకు మైనస్ గా మారింది.

*తెరపైకి జగ్గారెడ్డి
కేసీఆర్ ను ఇక తిట్టను అంటున్న జగ్గారెడ్డి.. తనకు పీసీసీ పగ్గాలు ఇస్తే పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలో తన దగ్గర వ్యూహాలున్నాయని మీడియాతో చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తలు.. నాయకులను ఒక్కతాటిపైకి తెచ్చే సామర్థ్యం తనకుందంటున్నాడు.

*కలుపుకుపోయే శ్రీధర్ బాబు
ఇక అందరివాడుగా కాంగ్రెస్ ఉన్నది ఎమ్మెల్యే శ్రీధర్ బాబే. అందరితో కలుపుకొని పోయి పనులు చక్కబెట్టగల నేత. ఇక టీఆర్ఎస్ ఆకర్షించినా ఆ పార్టీలోకి పోకుండా కాంగ్రెస్ నే నమ్ముకొని ఉన్నారు. ఈయన కూడా పీసీసీ పదవి విషయంలో ముందున్నారని అంటున్నారు.

*భట్టికి కష్టమే..
కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అవకాశం దక్కించుకున్న భట్టికి ఇప్పుడు పీసీసీ పగ్గాలు ఇవ్వడం కష్టమే. వరుసగా రెండు పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు ఒప్పుకోరు. ఈయనను వ్యతిరేకించేవారు పార్టీలో ఉండడంతో అవకాశం దక్కడం కష్టమేనంటున్నారు..

మొత్తంగా పీసీసీ మార్పుగనుక జరిగితే ఈ ఐదుగురిలో ఒకరు కొత్త పీసీసీ సారథి కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే జాతీయ స్థాయిలో రాహుల్ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపడితేనే ఈ రాష్ట్రాల పీసీసీల మార్పు జరుగుతుంది. మరి ఆ రోజు వరకు వేచిచూడాల్సిందే.