Begin typing your search above and press return to search.

ఇప్పటివరకు వచ్చిన మొదటి మహిళకు భిన్నం.. జిల్ బైడెన్

By:  Tupaki Desk   |   6 Nov 2020 5:00 AM GMT
ఇప్పటివరకు వచ్చిన మొదటి మహిళకు భిన్నం.. జిల్ బైడెన్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం అడుగు దూరన ఆగి ఉంది. ఊరించే గెలుపునకు బైడెన్ కు ఆరు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అవసరమైతే.. ట్రంప్ కు దాదాపు 56 ఓట్ల దూరంలో ఉన్నారు. ఇంకా ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం బైడెన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా మీడియా సంస్థలు.. బైడెన్ ను గెలిచినట్లుగా చెప్పేస్తున్నాయి కూడా. ఇలాంటివేళ.. బైడెన్ సతీమణి జిల్ బైడెన్ అమెరికా తొలి మహిళ కానుందా? అన్నది చర్చగా మారింది.

వైట్ హౌస్ కి ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ లేడీలకు పూర్తి భిన్నం జిల్ బైడెన్ అన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే బైడెన్ వెంట ఉన్న ఆమె.. అందరిని ఆకర్షిస్తున్నారు. అందుకు కారణం.. ప్రచారంలో ఆమె ప్రదర్శించిన ఉత్సాహమే. కొన్ని కీలకమైన సమయాల్లో బైడెన్ కు దన్నుగా నిలిచేందుకు ఆమె ప్రదర్శించిన ధైర్యం అందరిని ఆకట్టుకుంది.

ప్రచారంలో భాగంగా ఒకసారి నిరసనకారులు బైడెన్ మీదకు దూసుకొచ్చారు.ఆ సందర్భంలో ఏ మాత్రం తగ్గని జిల్ బైడెన్.. భర్తకు రక్షణగా నిలబడిన వైనం ఎవరూ మరచిపోలేరు. 1951లో న్యూజెర్సీలో పుట్టిన జిల్.. పెరిగింది మాత్రం పెన్సిల్వేనియాలోనే. 1977లొ బైడెన్ తో ఆమెకు వివాహమైంది. వీరి కుమార్తె 39 ఏళ్ల అశ్లే సామాజిక కార్యకర్తగా.. ఫ్యాషన్ డిజైనర్ గా పేరుంది. బైడెన్ తో జిల్ కు ఇది రెండో వివాహం. మొదటి భర్త బిల్ స్టీవెన్ సన్ తో ఆమె 1974లో విడిపోయారు.

బైడెన్ కు కూడా ఇది రెండో వివాహమే. జిల్ ను పెళ్లి చేసుకోవటానికి ముందు ఆయన నైలియా హంటర్ తో పెళ్లైంది. వారికి ముగ్గురు పిల్లలు. 1972లో జరిగిన కారు ప్రమాదంలో భార్యతో పాటు.. కుమార్తెను ఆయన కోల్పోయారు. ఇద్దరు కొడుకులు గాయాలతో బయటపడ్డారు. వీరిలో 46 ఏళ్ల బియూ బైడెన్ ఐదేళ్ల క్రితం (2015లో) మరణించారు. జిల్ విషయానికి వస్తే.. ఆమె అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేసే ఆమె.. ఎన్నికల ప్రచారం కోసం తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నారు. ఫలితాలు వెల్లడయ్యాక మళ్లీ అధ్యాపకురాలిగా పని చేస్తారని అంటున్నారు.

గతంలో బైడెన్ దేశ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన వేళలో.. దేశ రెండో మహిళ హోదాలో ఉండి కూడా కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేయటం గమనార్హం. ఒకవైపు దేశ ఉపాధ్యక్షుడి సతీమణిగా అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటూనే ప్రొఫెసర్ గా వ్యహరించిన ఆమె.. ఈసారి బైడెన్ దేశాధ్యక్షుడైతే.. ఫస్ట్ లేడీగా ఉంటూనే అధ్యాపకురాలిగా వ్యవహరించటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. వైట్ హౌస్ ఫస్ట్ లేడీల్లో జిల్ మాదిరి ఎవరూ లేరన్న మాట వినిపిస్తోంది.