Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడుతున్నదెవరు?

By:  Tupaki Desk   |   20 Sept 2017 11:05 PM IST
ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడుతున్నదెవరు?
X
పద్మ పురస్కారాలు ప్రకటించే వేళ మరోసారి ఎన్టీఆర్ పేరు వినిపించింది. అయితే... తెలుగోళ్ల ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తికి భారత రత్న ఇవ్వాలా వద్దా అన్నది మాత్రం ప్రజాభీష్ఠంపై కాకుండా కొందరు వ్యక్తుల ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయంగా మారిపోయింది. పద్మ అవార్డులు, భారతరత్న విషయంలో కీలకంగా వ్యవహరించే కేంద్ర హోం శాఖ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలా వద్దా అన్నది ప్రధాని మోడీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తేల్చేసింది.

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన‌ డిమాండ్‌పై కేంద్ర హోంశాఖ ఇలా స్పందించింది. ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాలంటూ వచ్చిన ప్రతిపాదనలను ప్ర‌ధానమంత్రి కార్యాల‌యానికి పంపిన‌ట్లు పేర్కొంది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ గ‌త‌ జులై 19న లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని అంశాన్ని లేవనెత్తారు. 377వ నిబంధన ప్ర‌కారం ఎన్టీఆర్‌కు ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని ఆయన కోరారు.

అయితే... ఎన్టీఆర్ కు భారత రత్న విషయంలో మరో వాదనా వినిపిస్తోంది. చంద్రబాబు కేంద్రాన్ని కోరితే ఇది సాధ్యం కావడానికి ఎంతో సమయం పట్టదని.. కానీ, చంద్రబాబు కొన్ని కారణాల వల్ల దీనిపై స్పందించడం లేదన్న వాదనా ఉంది. ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు లక్ష్మీపార్వతిని వివాహమాడారు. అనంతరం పార్టీలో ఆమె ఎదుగుదలను ఇష్టపడని చంద్రబాబు టీడీపీని చీల్చి తాను సీఎం అయ్యారు. ఇదంతా గత చరిత్రే కానీ, దీనికీ ఎన్టీఆర్ భారతరత్నకు సంబంధం ఉందంటున్నారు తెలుగు రాజకీయ ఉద్దండులు కొందరు. ఎన్టీఆర్ ఇప్పుడు దివంగతుడు కాబట్టి ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ఇస్తే దాన్ని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అందుకోవాల్సి ఉంటుంది. అది ఎంతమాత్రమూ ఇష్టం లేని చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే విషయంలో జోక్యం చేసుకోవడం లేదన్నది టాక్.