Begin typing your search above and press return to search.

కీలక నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసేది అన్నా? తమ్ముడా?

By:  Tupaki Desk   |   24 April 2023 10:33 AM GMT
కీలక నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసేది అన్నా? తమ్ముడా?
X
గత ఎన్నికల్లోనే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏపీలో కీలక నియోజకవర్గాల్లో ఒకటి.. మంగళగిరి. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఓడిపోయారు. 2014లో మంగళగిరి నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి 12 ఓట్ల తేడాతో గెలుపొందారు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున గంజి చిరంజీవి పోటీ చేశారు.

కాగా 2024 ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటు ఇవ్వబోరని గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని వైఎస్‌ జగన్‌.. ఎమ్మెల్యే ఆర్కేకు చెప్పారని అంటున్నారు. ఆర్కేను పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి పోటీ చేయిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. అంబటిని వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పోటీ చేయించి.. సత్తెనపల్లి సీటును ఆర్కేకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇక మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు, రాంకీ గ్రూప్‌ సంస్థల అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ఇస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం అయోధ్య రామిరెడ్డి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2014లో నరసరావుపేట నుంచి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి అయోధ్య రామిరెడ్డి ఓడిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ ఎంపీ పదవిని సీఎం జగన్‌ కట్టబెట్టారు.

కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తన సోదరుడు ఆర్కే ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఇటీవల కాలంలో ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి చురుగ్గా పర్యటిస్తున్నారని తెలుస్తోంది. వివిధ కార్యక్రమాలు, శుభకార్యాల పేరుతో ఎక్కువ రోజులు ఆయన మంగళగిరిలోనే తిరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు మంగళగిరి మున్సిపాలిటీ చైర్మన్‌ గా, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న గంజి చిరంజీవి ఇప్పటికే వైసీపీలో చేరారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఇస్తామనే పార్టీలో చేర్చుకున్నారని తెలుస్తోంది. 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 12 ఓట్లతో ఓడిన చిరంజీవికి 2019లో నారా లోకేష్‌ పోటీ చేయడంతో సీటు దక్కలేదు.

ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో చేనేతల ఓట్లు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో కాపులు, కమ్మలు ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌ మనసులో ఏముందో తెలియడం లేదని అంటున్నారు.

తనకు సీటు రాదని తేలిపోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే పార్టీ నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేది గంజి చిరంజీవా లేక ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అనేది తేలాల్సి ఉంది. లేకపోతే ప్రస్తుతమున్న ఆర్కేనే పోటీ చేస్తారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.