Begin typing your search above and press return to search.

ఎవరీ బుస్స కృష్ణ? అతడికి ట్రంప్ కు లింకేమిటి?

By:  Tupaki Desk   |   3 Oct 2020 7:50 AM GMT
ఎవరీ బుస్స కృష్ణ? అతడికి ట్రంప్ కు లింకేమిటి?
X
ఒకరి మీద అభిమానం ఎందుకన్నది ఒక్క మాటలో సమాధానం చెప్పలేని సూటి ప్రశ్న. అక్కడెక్కడో అమెరికాలోని ట్రంప్ ను అరవీర భయంకరంగా అభిమానించే కొంతమంది ఉన్నారు. అందులో ఒకరు జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బుస్స కృష్ణ. ట్రంప్ మీద ఇతగాడికి ఉన్న అభిమానం అతడ్ని మీడియాలో కనిపించేలా చేయటమే కాదు.. అతడి గురించి.. అతడి అభిమానం గురించి తరచూ వార్తలు వస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి ఇప్పుడు వచ్చింది.

అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించటం కోసం బుస్స కృష్ణ పడుతున్న ఆరాటం.. అందుకోసం పడుతున్న కష్టం చూస్తే.. ట్రంప్ కు అసలుసిసలు భక్తుడిగా చెప్పక తప్పదు. ఇప్పటికే వెలువడిన సర్వేలోనూ.. తొలి ముఖాముఖిలోనూ ట్రంప్ తో పోలిస్తే.. బైడెన్ ముందంజలో ఉన్నట్లుగా చెబుతున్నా.. బుస్సే మాత్రం నో చెప్పేస్తారు. ఈసారి కూడా ట్రంపే గెలుస్తాడని చెబుతారు.

భారత్ మీద ట్రంప్ చేసిన విమర్శలకు ధీటుగా బదులిస్తారు. కరోనా మరణాలపై ఇండియా కచ్ఛితమైన సమాచారం ఇవ్వటం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై బుస్సే స్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రధాని మోడీనే సీరియస్ గా తీసుకోలేదు.. అలాంటి ఇష్యూ మీద వాదన అవసరమా? అని తేల్చేస్తాడు. ట్రంప్ ఎన్నికల్లో కచ్ఛితంగా గెలుస్తారని.. ప్రధాని మోడీతో కలిసి చైనాను కట్టడి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. ట్రంప్ మీద తనకున్న అభిమానానికి గుర్తుగా ఆయన ఇంటి ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజులు పూజలు చేయటం బుస్సే కృష్ణకే చెల్లింది. ట్రంప్ గెలుపు కోసం తరచూ ధ్యానం చేసే ఆయన ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.