Begin typing your search above and press return to search.

కమళానికి కొత్త బాస్.?

By:  Tupaki Desk   |   1 Aug 2019 4:37 AM GMT
కమళానికి కొత్త బాస్.?
X
దక్షిణాదిన పాగా వేసేందుకు అనువైన రాష్ట్రంగా బీజేపీకి తెలంగాణే కనిపిస్తోందట.. అందుకే అమిత్ షా ఇక్కడే సభ్యత్వ నమోదు చేపట్టి సభ్యత్వాన్ని కూడా తీసుకున్నాడు. 2024లో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావడానికి స్కెచ్ గీస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్- టీఆర్ ఎస్ మాజీలను చేర్చుకుంటూ దూకుడుగా ముందుకెళ్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక అసెంబ్లీ స్థానం బీజేపీ గెలిచేసరికి అధిష్టానం తెలంగాణ వైపే చూడలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలిచేసరికి ఇక బీజేపీ ఆపరేషన్ తెలంగాణ చేపట్టింది. ఏపీతోపాటు తెలంగాణలోనూ బలపడడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేసరికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమాగా ఉన్నారు.

అయితే తెలంగాణలో ఇప్పుడు అధ్యక్షుడి మార్పు అనివార్యం అన్న సంకేతాలు వెలువడుతున్నాయట.. బీజేపీపై కొండంత ఆశతో ఇతర పార్టీల నుంచి చేరిన వారిని సంతృప్తి పరచడం.. కొత్తగా గెలిచి తెరపైకి వచ్చిన వారిని గౌరవించడంతోపాటు తెలంగాణ బీజేపీకి కొత్త రక్తం ఎక్కించడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చబోతున్నారన్న వార్త హల్ చల్ చేస్తోంది. ప్రధానంగా ఈ అధ్యక్ష రేసులో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ తోపాటు కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్- అరవింద్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వీరితోపాటు బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన సీనియర్లు డీకే అరుణ- జితేందర్ రెడ్డిలకు కూడా అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరి ఈ ఐదుగురిలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అవుతారు? అసలు ప్రస్తుత అధ్యక్షుడిని మారుస్తారా లేదా అన్నది వేచిచూడాలి.