Begin typing your search above and press return to search.

వైఎస్ ఫార్ములా: బాబు, కేసీఆర్ లో ఎవరికి లాభం

By:  Tupaki Desk   |   8 May 2019 11:40 AM GMT
వైఎస్ ఫార్ములా: బాబు, కేసీఆర్ లో ఎవరికి లాభం
X
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ విభజనకు ముందు రెండు సార్లు కాంగ్రెస్ ను ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత.. ఆయన వ్యూహాలు, ఎన్నికల ఎత్తుగడలు అన్ని పనిచేశాయి. ఇప్పుడు ఆయన ఫార్ములానే ఈ ఎన్నికల్లో ప్రయోగించారు ఇద్దరు చంద్రులు. మరి ఒకచోట హిట్ అయిన ఫార్ములా రెండో చోట కూడా హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. కానీ చంద్రబాబు గుడ్డిగా ఫాలో అయ్యారు.. ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది.

2004లో చంద్రబాబుపై వ్యతిరేకత.. కాంగ్రెస్ కు అండగా వైఎస్ సామర్థ్యాన్ని మెచ్చి జనం గెలిపించారు. 2009లో వైఎస్ విశేష సంక్షేమ జల్లు కురిపించారు. తెలంగాణలో అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగారు. అనంతరం రెండో విడత పోలింగ్ లో మాత్రం ఆంధ్రాలో అభివృద్ధి నినాదం పనిచేయదని పసిగట్టి సెంటిమెంట్ రాజేశారు. తెలంగాణలో పోలింగ్ ముగియగానే ఆంధ్రాలో ప్రాంతంలో ప్రచారం చేస్తూ హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సిందే అంటూ ఆంధ్రప్రజలను హెచ్చరించారు. వలస పక్షుల్లా జీవించాలని ఓటర్లలో సెంటిమెంట్ ను బలంగా దింపారు. ఆయన ఏపీ వ్యూహం ఫలించింది. దాంతో రెండోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కించుకున్నారు. కేసీఆర్, చంద్రబాబు, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడినా విజయం దక్కించుకోలేకపోయాయి.

ఇదే వ్యూహాన్ని కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రయోగించారు. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డ వేళ.. తెలంగాణ పాలన ఆంధ్రా బాబుకు అప్పగిద్దామా అంటూ సెంటిమెంట్ రాజేశారు. అవే ఓట్లుగా మారి విజయతీరాలకు చేర్చాయి. మరోసారి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ వ్యూహాన్నే చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. కేసీఆర్, జగన్, మోడీ కలిసిపోయారని ఆంధ్రుల ఆత్మగౌరవం గులాబీ పార్టీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు.

అయితే ఎప్పటి మంత్రం అప్పుడే వేయాలి.. వైఎస్ తెలంగాణలో అభివృద్ధి, ఏపీలో సెంటిమెంట్ రాజేశారు. రెండూ భిన్న వ్యూహాలు.. ఈ మంత్రం మరోచోట పఠిస్తే ఏమేరకు ఫలితం ఉంటుందన్నది అనుమానమేనంటున్నారు విశ్లేషకులు.. తెలంగాణలో హిట్ అయిన సెంటిమెంట్ ఫార్ములా ఆంధ్రాలో టీడీపీకి కలిసి వచ్చింది తక్కువేనంటున్నారు. కేసీఆర్ ముందే మేల్కొని ప్రత్యేక హోదాకు, పోలవరంకు మద్దతు పలకడం.. పైగా ఆంధ్రాలో పర్యటించకపోవడంతో పరిస్థితి మారింది. చంద్రబాబు అనవసర ప్రచారం చేస్తున్నట్లుగా ఓటర్లు గుర్తించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు కూడా కేసీఆర్, మోడీని లెక్కలోకే తీసుకోలేందంటున్నారు. వారిని బూచీగా చూపిన బాబుకు ఇదే మైనస్ గా మారింది. అయినా వైఎస్ దశాబ్ధం కింద ప్రయోగించిన ఈ ఫార్ములా రెండు భిన్న ప్రజలకు అప్లై చేయడం చంద్రబాబుకు మైనస్ అంటున్నారు.. చూడాలి మరి ఏం జరుగుతుందో..