Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్ విధ్వంసానికి వెనుక స్కెచ్ ఏంటి? సుబ్బారావుపై ప్రశ్నల వర్షం

By:  Tupaki Desk   |   19 Jun 2022 7:30 AM GMT
సికింద్రాబాద్ విధ్వంసానికి వెనుక స్కెచ్ ఏంటి? సుబ్బారావుపై ప్రశ్నల వర్షం
X
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ పై దేశవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్డు ఎక్కి, రైలు పట్టాలపైకి వచ్చి నిరసనలు తెలిపారు. రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టించారు. ఈ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన ఈ విధ్వంసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దాడులకు ప్రధాన సూత్రధారిగా సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇప్పటికే సుబ్బారావును అరెస్ట్ చేసిన నరసరావుపేట పోలీసులు ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రైల్వేస్టేషన్లు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వ్యూహరచన ఎలా జరిగింది? దీనివెనుక ఇంకెవరున్నారు? అభ్యర్థులు బయటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సమాచారం ఎలా షేర్ చేశారు? అనే ప్రశ్నలకు పోలీసులు సుబ్బారావు నుంచి సమాధానాలు రాబడుతున్నట్లు సమాచారం.

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సాయిడిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నామని నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో సుబ్బారావు పాత్ర ఉందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సుబ్బారావు పాత్ర ఉందా? లేదా? అనేది విచారిస్తున్నామని ఆయన తెలిపారు. ఆందోళన జరిగిన సమయంలో తాను అక్కడలేనని సుబ్బారావు చెప్పాడని అన్నారు.

సుబ్బారావు విద్యార్థులకు వాట్సాప్ మెసేజ్ లు పంపాడని.. వాటి గురించి పరిశీలన చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు అకాడమీ ద్వారా రెండు వేల మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇప్పించానని సుబ్బరావు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనకు నరసారావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ఖమ్మంలో అదుపులోకి తీసుకొని నరసరావుపేటకు తరలించారు. అగ్నిపథ్ వల్ల నష్టం కలుగుతుందంటూ వీడియో సందేశం ద్వారా ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మిగతా ప్రైవేట్ సెంటర్ల నిర్వాహకులు ఆందోళనకారులకు సహకరించినట్లు గుర్తించారు.

సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్ కు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిల్ లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్టు పోలీసులు తేల్చారు.