Begin typing your search above and press return to search.

లోకేష్ గ్రాఫ్ డౌన్ వెనుక ఉన్న‌ది వీరేనా...?

By:  Tupaki Desk   |   12 Nov 2021 4:30 PM GMT
లోకేష్ గ్రాఫ్ డౌన్ వెనుక ఉన్న‌ది వీరేనా...?
X
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, యువ నాయ‌కుడు,, మాజీ మంత్రి నారా లోకేష్‌.. గ్రాఫ్ డౌన్ అయిందా? నిన్న మొన్న‌టి వ‌ర‌కు పుంజుకుంటున్న ద‌శ‌లో. ఇప్పుడు అనూహ్యంగా ఎందుకు డౌన్ అయింది? కొన్నా ళ్లుగా గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా దూకుడుగా ఉన్న లోకేష్ గ్రాఫ్ పెరుగుతోంద‌ని అంద‌రూ అనుకున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఇలా ఎందుకు జ‌రిగింది ? దీనివెనుక ఎవ‌రు ఉన్నారు ? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. ప్ర‌స్తుతం ఉన్న అంశాల‌ను ప‌రిశీలిస్తే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కొంద‌రు సీనియ‌ర్లు లోకేష్ నాయ‌క‌త్వానికి అడ్డుప‌డుతున్నార‌నే వాద‌న వినిపించింది.

కార‌ణాలు ఏవైనా.. కూడా.. చంద్ర‌బాబు ను మాత్ర‌మే నాయ‌కుడిగా గుర్తించేందుకు సీనియ‌ర్లు.. మాన‌సికంగా సిద్ధంగా ఉన్నారు. అదే స‌మ‌యంలో యువ నాయ‌కుడిగా లోకేష్‌ను వారు గుర్తించ‌లేదు. దీంతో.. లోకేష్ విష‌యంలో కొన్నాళ్లుగా త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగింది. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు లోకేష్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సీనియ‌ర్ల‌తో త‌ర‌చుగా ఫోన్ల‌లో మాట్లాడ‌డం.. వారి సూచ‌న‌ల‌ను.. కూడా తీసుకుంటున్నారు. కొంద‌రిని ఆయ‌న క‌లుపుకొని పోతున్నారు.

అయితే.. ఇటీవ‌ల అధికార పార్టీ వైసీపీ.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో లోకేష్‌ను బూచిగా చూపించి.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్ బృందం ప్ర‌య‌త్నిస్తోంద‌నే వాద‌న వెలుగు చూసింది. టీడీపీ అనుకూల మీడియాలోనూ ఈ త‌ర‌హా క‌థ‌నాలు రావ‌డం.. పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. అస‌లు మాకు మీరు మేలు చేస్తున్నారా? లేక‌.. ఏం చేస్తున్నార‌నే వాద‌న లోకేష్ అనుకూల నాయ‌కుల నుంచి ఎదురైంది.

అంతేకాదు.. లోకేష్ లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లేవా ? అనే ప్ర‌శ్న కూడా సంధించారు. వాస్త‌వానికి 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు లోకేష్ వ్యూహం ఎంతో ప‌నిచేసిందని.. పార్టీని డిజిట‌ల్‌గా ముందుకు తీసుకువెళ్ల‌డం.. పార్టీ స‌భ్య‌త్వాలు న‌మోదు చేయించడం. వంటివి ఎంతో ఉప‌క‌రించాయ‌ని.. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను కూడా ఆయ‌న భుజాన వేసుకుని .. ముందుకు న‌డిపించార‌ని.. అలాంటి నాయ‌కుడిని త‌క్కువ చేస్తారా? అంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు పార్టీలోనే చ‌ర్చ సాగింది.

ఇక‌, ఏమైందో ఏమో.. ఆ వార్తా క‌థ‌నం త‌ర్వాత‌.. లోకేష్ మ‌ళ్లీ సైలెంట్ అయ్యారు. మ‌రి..టీడీపీ అనుకూల మీడియానే ఇలా చేస్తోందా? లేక‌. దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.