Begin typing your search above and press return to search.

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వెనుక ఎవరున్నారు?

By:  Tupaki Desk   |   26 Jan 2023 8:33 AM GMT
మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వెనుక ఎవరున్నారు?
X
మోదీకి వ్యతిరేకంగా బ్రిటిష్ మీడియా బీబీసీ తన రెండో డాక్యుమెంటరీ కూడా ప్రసారం చేసింది. మొదటి వీడియోలాగానే ఇది కూడా ఇండియాలో ప్రసారం కానప్పటికీ రచ్చ మాత్రం మొదలైంది. తొలి వీడియోను యూట్యూబ్, ట్విటర్ సహా ఎక్కడా ఉండరాదంటూ భారత్ ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించగా తాజాగా రెండో వీడియోపై ఆంక్షలు మొదలయ్యాయి.

నిన్న ఈ రెండో వీడియో బ్రిటన్‌లో ప్రసారమైంది. ఇందులో చాలా భాగం తొలి వీడియోల ఉన్న సన్నివేశాలే ఉన్నాయి. దానికి అదనంగా మోదీ 2019 ఎన్నికలలో విజయం సాధించడం, ముస్లింలతో ఆయనకున్న దూరం వంటి అంశాలను ఈ రెండో వీడియో ప్రస్తావించింది. రెండు వీడియోలలోనూ బీబీసీ కొత్తగా చెప్పిందేమీ లేకపోగా పనిగట్టుకుని ఎన్నికలకు ముందు మోదీకి వ్యతిరేకంగా దీన్ని ప్రచారంలోకి తెచ్చిందన్నది బీజేపీ నేతల వాదన.

ఇదంతా ఎలా ఉన్నా చాలామందికి అర్థం కాని ప్రశ్న ఇప్పుడొకటి ఉంది. బీబీసీ హఠాత్తుగా మోదీకి వ్యతిరేకంగా డాక్యుమెంటరీలు ఎందుకు ప్రసారం చేస్తోంది. దీని వెనుక ఎవరున్నారు? లక్ష్యమేంటి వంటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇది బ్రిటన్‌లోని బీబీసీ -2, బీబీసీ పనోరమాలలో ప్రసారమైన కార్యక్రమం.. దానికోసం రూపొందించిన డాక్యుమెంటరీయే అయినప్పటికీ ఏడాది కిందటే దీనికి బీజం పడింది. దిల్లీలోని బీబీసీ ఇండియా నుంచి ఇద్దరు ముగ్గురు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని సమాచారం. ముఖ్యంగా బీబీసీ గుజరాతీ విభాగానికి ఎడిటర్‌గా పనిచేసిన, గుజరాత్‌కు చెందిన జర్నలిస్ట్‌ను ఈ డాక్యుమెంటరీ కోసమే ఇన్విస్టిగేషన్ పేరుతో ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం.

దిల్లీ బీబీసీ ఆఫీస్ కేంద్రంగా హిందీ, మరాఠీ, తెలుగు, గుజరాతీ, బెంగాలీ వంటి భాషల్లో వార్తాప్రసారాలున్నాయి. బీబీసీ హిందీ నుంచి కూడా మోదీ వ్యతిరేక వార్తలు ఎక్కువగానే వస్తాయి కానీ ఆ విభాగంలో పనిచేసేవారిలో ఎక్కువ మంది బ్రాహ్మణులు కావడంతో మోదీ వ్యతిరేక వార్తలను నిత్యం వ్యతిరేకిస్తుంటారని దిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు చెందిన కొందరు బీబీసీ జర్నలిస్ట్‌లు, ముఖ్యంగా జేఎన్‌యూ, హెచ్‌సీయూలలో చదువుకున్నవారు, దళిత ఉద్యమాలలో పనిచేసినవారు, ఇతరకులాలకు చెందినవారైనప్పటికీ దళితులమని చెప్పుకొనితిరిగేవారు బీబీసీలో ఉన్నారని, వారంతా తీవ్రమైన మోదీ వ్యతిరేకతతో నిత్యం ఆ అజెండా చొప్పిస్తుంటారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా బీబీసీ వార్తలు రాస్తుందని, అదేసమయంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త రాజకీయం ప్రారంభించిన కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రాయదని విశ్లేషిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.