Begin typing your search above and press return to search.

అలా చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ : డబ్ల్యూహెచ్‌ఓ

By:  Tupaki Desk   |   26 Oct 2020 10:30 AM GMT
అలా చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ :  డబ్ల్యూహెచ్‌ఓ
X
కరోనా మహమ్మారి విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. పలు దేశాల్లో మళ్లీ తీవ్ర స్థాయిలో కరోనా వ్యాధి వ్యాప్తి జరుగుతుంది. అయితే కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలి అంటే ఒక్క వ్యాక్సిన్ తో నే అవుతుంది. అందుకే , ఆ వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వైద్య నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ,కొన్ని దేశాలు కరోనా మహమ్మారికి విరుగుడు కనిపెట్టిన వెంటనే మొదటగా తమ దేశ ప్రజలకి ఇవ్వాలని అనుకుంటున్నాయి. అయితే , కరోనా నిరోధక వ్యాక్సిన్‌ తమ ప్రజలకే ముందుగా అందించాలన్న దేశాల ఆలోచనా విధానం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గేబ్రియేసస్‌ అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్ ‌ను ప్రభావంతంగా ఉపయోగించుకుంటేనే, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయవచ్చని, కొన్ని దేశాల్లోని ప్రజలందరికీ టీకా అందించడం కంటే కూడా, అన్ని దేశాల్లోని కొంతమంది ప్రజలకు వాక్సినేషన్‌ చేయడం ఉత్తమమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. రష్యాలో స్పూత్నిక్‌- వీ పేరిట టీకాను విడుదల చేయగా, క్లినికల్‌ ట్రయల్స్‌ తుది దశకు చేరుకున్న క్రమంలో మరికొన్ని కంపెనీలు, త్వరలోనే వ్యాక్సిన్‌ ను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి.

అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాలు భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ డోసులు కొనుగోలు చేసి, ప్రజలకు అందించే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే పేద దేశాల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ విషయం గురించి టెడ్రోస్‌ ఆదివారం నాటి సదస్సులో మాట్లాడుతూ.. తమ ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు దేశాలు పోటీపడటం సహజం. అయితే ఇప్పుడు వ్యాక్సిన్‌ను ఎంత ప్రభావంతంగా ఉపయోగించుకోగలమన్న అంశం మీదే కోవిడ్‌-19 వ్యాప్తి ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్‌ నేషనలిజం వల్ల మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలే తప్ప, దానిని నియంత్రించే అవకాశం ఉండదు. యూరప్‌ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇలాంటి తరుణంలో, వ్యాక్సిన్‌ను కొన్ని దేశాలకే పరిమితం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ప్రభావంతమైన వ్యాక్సిన్‌ విడుదలైతే, అన్ని దేశాల్లోనూ అది వినియోగంలోకి వచ్చినపుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి అని చెప్పారు.