Begin typing your search above and press return to search.

టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఎవ‌రికి లాభం...!

By:  Tupaki Desk   |   30 Nov 2021 4:08 AM GMT
టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఎవ‌రికి లాభం...!
X
బ‌ల‌మైన అధికార పార్టీ వైసీపీని నిలువ‌రించేందుకు టీడీపీ, జ‌న‌సేన ఒక్క‌ట‌వ్వ‌నున్నాయా? 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కుద‌ర‌నుందా? వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీకి గెలుపు అంత సులువు కాదా? ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ‌ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ఇలాంటి ప్ర‌శ్న‌లే త‌లెత్తుతున్నాయి.

వంద‌కు పైగా సీట్ల ల‌క్ష్యం...!

టీడీపీ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వంద‌కు పైగా సీట్ల‌ను గెల‌వాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ పార్టీ బ‌లంగా ఉన్న కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం, ప‌శ్చిమ‌గోదావ‌రి, తూర్పుగోదావ‌రిలో 80 శాతం సీట్లు, ఉత్త‌రాంధ్ర‌లో 50 శాతం సీట్లు, రాయ‌ల‌సీమ‌లో 30 శాతం సీట్లకు పైగా గెల‌వాల‌ని టార్గెట్ విధించుకుంది. సులువుగా గెలిచే స్థానాలు ఏమిటి? కాస్త క‌ష్ట‌ప‌డితే గెలిచే సీట్లు ఏవ‌నే లెక్క‌ల్లో మునిగిపోయింది.

ఒంట‌రిపోరుతో సాధ్య‌మేనా..?

టీడీపీ అధికార పీఠం ఎక్కాలంటే.. వంద‌కు పైగా సీట్లు సాధించాలంటే త‌మ బ‌లం స‌రిపోతుందా లేదా అనే అంచ‌నాల్లో ఉంద‌ట‌. ఒంట‌రిపోరు వ‌ల్ల ఓట్లు, సీట్లు చీలిపోయి తిరిగి వైసీపీ పైచేయి సాధించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తోంద‌ట‌. జ‌న‌సేన‌తో పొత్తు కుదిరితే వైసీపీని అడ్డుకోవ‌చ్చ‌ని.. తిరిగి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌చ్చ‌ని ఆ పార్టీ పెద్ద‌లు యోచిస్తున్నార‌ట‌.

ప‌వ‌న్ చేయి కలిపేనా..?

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీడీపీతో చెలిమి చేయ‌డ‌మే మంచిద‌ని.. ఉమ్మ‌డి శ‌త్రువు అయిన వైసీపీని ఎదుర్కోవాలంటే ఇదొక‌టే మార్గ‌మ‌ని జ‌న‌సేన వ‌ర్గాలు కూడా భావిస్తున్నాయ‌ట‌. అయితే, ఇంకోవైపు టీడీపీపై అనుమానం కూడా వ్య‌క్తం చేస్తోంద‌ట‌. 2014లో టీడీపీ అధికారంలోకి రావ‌డానికి కృషి చేస్తే త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని.. త‌మ పార్టీ ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని జ‌న‌సేన వ‌ర్గాలు భావిస్తున్నాయి. అందుకే 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరుకు వెళ్లామ‌ని చెబుతున్నాయి. 5 శాతం ఓట్ల‌కే ప‌రిమితం అయ్యామ‌ని గ‌తాన్ని గుర్తు చేసుకుంటున్నాయి.

త‌మ‌కేం లాభ‌మంటున్న జ‌న‌సేన‌..!

వైసీపీని ఓడించ‌డానికి టీడీపీతో క‌లిసి వెళ్తే త‌మ‌కేం లాభం జ‌రుగుతుంద‌న్న లెక్క‌ల్లో జ‌న‌సేన వ‌ర్గాలు ఉన్నాయ‌ట‌. పోటీచేసే సీట్ల‌పై టీడీపీదే పైచేయిగా ఉంటుంద‌ని.. త‌మ‌ను త‌క్కువ సీట్ల‌కే ప‌రిమితం చేసే అవ‌కాశం ఉంద‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పొత్తుల‌తో క‌లిసి అధికారంలోకి వ‌చ్చినా సీఎం ప‌ద‌వి చంద్ర‌బాబే చేప‌డ‌తార‌ని.. ప‌వ‌న్ ప‌రిస్థితి ఏమిట‌ని ఆలోచిస్తున్నార‌ట‌.

భ‌విష్య‌త్తులో కూడా టీడీపీ త‌మ‌ను డామినేట్ చేసే ప‌రిస్థితి ఉంటుంద‌ని.. త‌మ రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను అడ్డుకుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. వీట‌న్నింటికీ కాల‌మే స‌మాధానం చెబుతుంద‌నే భావ‌న‌లో రెండు పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల పొత్తుల వ్య‌వ‌హారం ఎంత‌వ‌ర‌కు వెళుతుందో వేచిచూడాలి.